సూర్యాపేట జిల్లా: తెలంగాణ ఏర్పడిన తర్వాత రెండు సార్లు విజయం సాధించి హ్యట్రిక్ కోసం ఎదురు చూస్తున్న సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ ప్రస్తుత ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్ధి గాదరి కిషోర్ కుమార్ హ్యాట్రిక్ ఆశలు గల్లంతయ్యే అవకాశం ఉందా అంటే మారుతున్న రాజకీయ, సామాజిక సమీకరణాలను బట్టి చూస్తే నిజమే అనిపిస్తుందని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.2014,2018 ఎన్నికల్లో చావుతప్పి కన్నులొట్ట పోయినట్లు అతి తక్కువ ఓట్లతో బయటపడిన గాదరికి 2023 ఎన్నికల్లో గడ్డు కాలం తప్పేలా లేదని,దీనికి కారణం పదేళ్లుగా తుంగతుర్తి నియోజకవర్గంలో అంతులేని అవినీతి జరిగిందని ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు తీవ్ర ఆరోపణలు చేయడం, విపరీతమైన సాండ్, ల్యాండ్ మాఫియాతో పాటు ప్రభుత్వ పథకాలైన దళిత,బీసీ బంధుల్లో అనేక అక్రమాలు జరిగాయని ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఆ వర్గాల ప్రజలు గళమెత్తడమేనని తెలుస్తోంది.
ముఖ్యంగా ఇసుక మాఫియా ఎమ్మెల్యే విజయానికి ప్రధాన అడ్డంకిగా మారగా,దళిత బంధు లబ్ధిదారుల వద్ద లక్షల రూపాయలు వసూలు చేయడం, అయినా నేటికీ వారు దళిత బంధుకు నోచుకోకపోవడంపై పెద్ద ఎత్తున వచ్చిన ఆరోపణలు అగ్నికి ఆజ్యం పోసినట్లు అయిందని అంటున్నారు.దళిత బంధులో జరిగిన అవినీతికి నూతనకల్ మండలంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన స్థానిక నేతలు,సర్పంచులు, ఎంపీటీసీలు దళిత బంధు ఇప్పిస్తామని లక్షల్లో వసూలు చేయగా గాదరి గెలుపు కష్టమేనని,ఇక దళితబంధు రాదని గ్రహించిన లబ్ధిదారులు తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వాలని వత్తిడి చేయడం,చేసేదేమీలేక వారికి తీసుకున్న 30% డబ్బులు తిరిగి చెల్లిస్తున్నట్లు వస్తున్న వార్తలు దీనికి అద్దం పడుతుందని గులాబీ శిబిరంలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇది చాలదన్నట్లు బీసీబంధులో కొందరు స్థానిక ప్రజా ప్రతినిధులు ఒక అడుగు ముందుకేసి 50%డబ్బులు తీసుకున్నట్లు,ఇదంతా ఎమ్మెల్యే కనుసన్నల్లోనే జరిగిందని ఆరోపణలు రావడంతో ఆ వర్గాల ప్రజలు గుర్రుగా ఉన్నట్లు తెలుస్తుంది.మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు వీటికి తోడు నియోజకవర్గంలో ఎస్సీ మాదిగ ఓటర్ల ప్రభావం అధికంగా ఉండటం,గత రెండు పర్యాయాలు మాల సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థి పెత్తనం చేయడం, అప్పటి ప్రత్యర్థి కూడా అదే సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో పదేళ్లుగా మాదిగలు అవమానాలు, భౌతికదాడులు,హత్యలవంటి నిర్భంధ పరిస్థితులు ఎదుర్కొన్నారు.
నియోజకవర్గంలో 60 వేలకు పైగా మాదిగల ఓట్లు ఉండటంతో ఈ సారి కాంగ్రెస్ ఆలస్యమైనా అడుగు సరిగ్గా వేసిందని, స్థానికుడైన మాదిగ సామాజిక వర్గానికి చెందిన మాజీ గిడ్డంగుల చైర్మన్, బీఆర్ఎస్ ఉద్యమ నేత మందుల సామ్యేల్ ను అభ్యర్ధిగా ప్రకటించడం బీఆర్ఎస్ పార్టీకి పెద్ద దెబ్బగా భావిస్తున్నారు.మరీ ముఖ్యంగా ఎమ్మెల్యే గాదరి కిషోర్ అహంకారపు పదజాలంతో బెదిరింపు ధోరణితో మాట్లాడడం కూడా ఓటమికి ఒక కారణంగా చెప్పుకుంటున్నారు.
నియోజకవర్గంలో నేటి వరకు డబుల్ బెడ్రూం ఇళ్ళ పంపిణీ ఊసే లేకపోవడం,వాటికోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న వారు ఎమ్మెల్యేపై ఆగ్రహంతో ఉన్నారని,ఇన్ని ప్రతికూల అంశాల నేపథ్యంలో హ్యాట్రిక్ విజయం అంత ఈజీ కాదనే వాదన బలంగా వినిపిస్తుంది.తుంగతుర్తిలో టిఆర్ఎస్ పార్టీని గ్రామ గ్రామాన నిర్మించిన ఉద్యమ నాయకుడు మందులను కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించడంతోనే రాజకీయ సమీకరణలు శరవేగంగా మారాయని, దీనితో గాదరి కిషోర్ ఓటమి అంగీకరించినట్లు చర్చించుకుంటున్నారు.
ప్రస్తుతం ఓటరు నాడి తెలుసుకోవడం సర్వేలకు కూడా అందడం లేదు.ఈ పరిస్థితిలో ఈ దఫా తుంగతుర్తి గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురవేస్తారా? లేదా తిరిగి బీఆర్ఎస్ కే పట్టం కడతారా అనేది వేచి చూడాలి మరి…!!
.