సూర్యాపేట జిల్లా:మోతె మండల పరిధిలోని నామవారం గ్రామంలో అగ్ర ఇతర కులాలకు చెందిన వారు మాదిగలంటే చిన్న చూపు చూస్తూ నిత్యం అవమానిస్తున్నారని,వారి నీచపు చూపులు, మాటలు భరించలేమని,ఇకపై గ్రామంలో ఇతర కులాల వారు చేసుకునే శుభ,అశుభ కార్యాలకు,గ్రామ దేవతల పండుగలకు వెళ్ళబోమని,పండుగలకు, చావులకు ఇకపై మాదిగలు ఎవరూ సహకరించమని, డప్పులు,కట్టెలు కొట్టమని గత గురువారం కుల పెద్దల సమక్షంలో ఏకగ్రీవంగా చేసుకున్న తీర్మానం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఈ తీర్మాణానికి వ్యతిరేకంగా ఎవరైనా మాదిగలు పోతే రూ.50 వేల జరిమానా విధిస్తామని ప్రకటించారు.ఈ సందర్భంగా మాదిగ కుల పెద్దలు మాట్లాడుతూ ఎన్నో ఏండ్లుగా కుల పరమైన సాంఘిక వృత్తులను చేసుకుంటూ అన్నదమ్ముల్లాగా అగ్ర ఇతర కులస్తులకు సహకరిస్తుంటే గ్రామంలో మాదిగ జాతిని అవమాన పరిచే విధంగా మాట్లాడుతున్నారని,మా గౌరవానికి భంగం కలిగించే వారికి మేమెందుకు సహకరించాలని ప్రశ్నించారు.
ఇతర కులాల వారు ఏ కార్యాలు చేసుకున్నా డప్పులు కొడుతూ,కట్టెలు కొడుతూ అన్ని విధాలా సహకరిస్తూ ఉంటే మమ్మల్ని నీచంగా చూడడం ఎంత వరకు సమంజసమని అన్నారు.అందుకే ఇక నుండి గ్రామంలో అగ్ర కులస్థులకు,గ్రామ దేవతల పండుగలకు మాదిగ జాతి తరుపున ఎలాంటి సహకారం అందించమని తేల్చిచెప్పారు.
ఈ కార్యక్రమంలో మాదిగ కుల పెద్దలు,యువకులు,మహిళలు పాల్గొన్నారు.