సూర్యాపేట జిల్లా: సంత్ శ్రీ సేవాలాల్ మహరాజ్ భవన్ కు సొంతంగా 5 లక్షలు, ఎంపి నిధుల నుండి 5 లక్షలు నిధులను మాజీ టీపీసీసీ అధ్యక్షుడు,నల్గొండ పార్లమెంటు సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు.మఠంపల్లి మండలం మట్టపల్లిలో ఏర్పాటు చేసిన సంత్ శ్రీ సేవాలాల్ మహరాజ్, జగదాంబ,భవాని, మహాభోగ్ బండారో కార్యక్రమానికి హాజరైన ఉత్తమ్ కుమార్ రెడ్డికి గిరిజనులు ఘనస్వాగతం పలికారు.
అనంతరం గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించారు.రెండు రోజుల్లో ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన గిరిజన సోదర,సోదరిమణులు అందరికి ఉత్తమ్ ధన్యవాదాలు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందిరాగాంధీ హయంలోనే గిరిజనులకు అన్ని రంగాల్లో అభివృద్ధికి బాటలు వేశారని గుర్తు చేశారు.2014 ఎన్నికల ముందు కేసీఆర్ గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్ కలిపిస్తానని హామీ ఇచ్చి గద్దెనెక్కిన తర్వాత విస్మరించారని,గిరిజనులకు 3 ఎకరాల భూమి ఇస్తానని గిరిజనులను మోసం చేసిండన్నారు.సిగ్గూ లజ్జా లేకుండా కేసీఆర్,సైదిరెడ్డిలు ఏ ముఖం పెట్టుకొని గిరిజనుల ఓట్లు అడుగుతారని దుయ్యబట్టారు.హుజూర్ నగర్ ఎమ్మెల్యే సైదిరెడ్డి రెండేళ్ల కాలంలో 300 ఎకరాలు సంపాదించాడని, అతడు చాలా గొప్పోడని ఎద్దేవా చేశారు.
నాగార్జున సిమెంట్ ఫ్యాక్టరీ నుండి107 ఎకరాలు గుర్రంబోడు వద్ద 150 ఎకరాలు,పెడవీడు రెవిన్యూ పరిధిలో 46 ఎకరాల ప్రభుత్వ భూమిని కొల్లగొట్టిన ఘనుడు సైదిరెడ్డి అని ఆరోపణలు గుప్పించారు.ఎమ్మెల్యేగా సైదిరెడ్డికి ఇదే మొదటిసారి, ఇదే చిట్టచివరి ఎన్నికని ఎద్దేవా చేశారు.5 సార్లు ఎమ్మెల్యేగా,ఒకసారి మంత్రి,7 సార్లు పిసిసిగా పని చేసిన తాను ఏం సంపాదించలేదన్నారు.మట్టపల్లిలో కృష్ణానదిపై కోట్ల రూపాయలతో శ్రీ లక్ష్మి నృసింహస్వామి వారధిని నిర్మాణం చేయించానని,అదే విధంగా నియోజక వర్గంలో లిప్ట్లు మారుమూల ప్రాంతాలకు రోడ్లు, హాస్పిటల్,స్కూల్స్,పోలీస్ స్టేషన్ లు,మండల పరిషత్ కార్యాలయాలు కట్టించింది తానేనని ప్రకటించారు.
మఠంపల్లి మండలంలోని గుండ్లపాడుకు ఎమ్మెల్యే సైదిరెడ్డి సొంత ఊరుకు రోడ్డు వేయించింది.అక్కడ పులిచింతల ముంపుకు గురి అయిన ఇండ్లకు పునరావాసం కలిపించేలా ఆర్&ఆర్ సెంటర్ ను నిర్మాణం చేయించింది తానేనని గుర్తు చేశారు.
నేరేడుచర్ల వైస్ ఎంపీపీ,ఎమ్మెల్యే సైదిరెడ్డి కమీషన్ల భాగోతం గురించి ఒక లేఖను కూడా రాశారని,ఆ లేఖలో ఎమ్మెల్యే సైదిరెడ్డి 10 శాతం కమీషన్ లేనిదే ఏ పని చేయరని గిరిజనుల సభలో గుర్తు చేశారు.ఎమ్మెల్యే సైదిరెడ్డి గ్రామపంచాయతీ లలో ఎల్ఈడి బల్పులు,ట్రాక్టర్ల కొనుగోళ్లలో భారీ అవినీతికి పాల్పడ్డారని,చివరకు బ్లీచింగ్ పౌడర్ ను కూడా వదిలి పెట్టలేదని మరోసారి ఆరోపించారు.
అధికార పార్టీ నాయకులు పోలీసులను అడ్డం పెట్టుకొని అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని, అవినీతిని ప్రశ్నించే వారిపై దాడులు,దౌర్జన్యాలు చేస్తూ,తప్పుడు కేసులు పెడుతున్నారని, ప్రజలెవరు భయపడవద్దని,సూర్యాపేట జిల్లాలో అన్యాయంగా ఎవరెవరిపై గ్రామాల్లో తప్పుడు కేసులు పెట్టారో ఆ లిస్టు తీసుకొని రావాలని,కేసులు నమోదు అయిన వారి జాబితాను ఒక బుక్ లెట్ ప్రింట్ చేసి హైకోర్టుకు సమర్పిద్దామని,అదే విధంగా తప్పుడు కేసులు నమోదుపై పార్లమెంట్ లో కూడా ప్రస్తావిస్తానని భరోసా ఇచ్చారు.పోలీసులు రాజకీయాలకు అతీతంగా తమ విధులను నిర్వర్తించాలని సూచించారు.
పోలీసులు అక్రమంగా కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని సభావేదిక నుండి పోలీసులను హెచ్చరించారు.మఠంపల్లి మండల అభివృద్ధి కోసం మీ ఉత్తమన్న కృషి చేస్తారని హామీ ఇచ్చారు.