అమెరికాలోని జార్జియాలో( Georgia ) ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది.కృత్రిమ గర్భధారణ( IVF ) చికిత్సలో జరిగిన తప్పిదం ఓ మహిళ జీవితాన్ని తలకిందులు చేసింది.
క్రిస్టెనా ముర్రే( Krystena Murray ) అనే మహిళ తాను కడుపులో మోసింది తన బిడ్డను కాదని తెలుసుకుని గుండె పగిలింది.ఫెర్టిలిటీ క్లినిక్( Fertility Clinic ) చేసిన నిర్వాకం కారణంగా ఆమె మరో జంట బిడ్డకు జన్మనివ్వాల్సి వచ్చింది.
ఈ దారుణమైన పొరపాటుపై ఆమె కోర్టును ఆశ్రయించడంతో ఈ వ్యవహారం సంచలనంగా మారింది.IVF చికిత్సల్లో జరుగుతున్న తప్పిదాలు, జన్యుపరమైన లోపాలపై ఈ కేసు తీవ్ర ఆందోళనలు రేకెత్తిస్తోంది.
క్రిస్టెనా ముర్రే (38) ఎప్పటినుంచో తల్లి కావాలని కలలు కంటూ ఉంది.పిల్లల కోసం ఎన్నో ప్రయత్నాలు చేసింది.చివరికి IVF చికిత్స చేయించుకోవాలని నిర్ణయించుకుంది.కోస్టల్ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్స్ క్లినిక్‌లో IVF కోసం రిజిస్టర్ చేసుకుంది.
ఎన్నో నెలలు ఎదురుచూసిన తర్వాత ఆమె గర్భం దాల్చింది.ఓ అందమైన మగ బిడ్డకు జన్మనిచ్చింది.
అయితే చూడగానే బిడ్డ నల్లగా ఉండటంతో ఒక్కసారిగా ఒక్కసారిగా షాక్ అయింది.ఎందుకంటే క్రిస్టెనా, ఆమె భర్త ఇద్దరూ తెల్ల జాతీయులు.
వీరిద్దరూ తెల్ల జాతీయులు అయి ఉండి నల్ల జాతీయుడు ఎలా పుడతాడు అని ఆమె అనుమానం వచ్చింది.

“బిడ్డను చూడగానే ప్రేమతో ముంచెత్తాను.కానీ ఏదో తేడా కొడుతోందని నా మనసు చెప్పింది” అని క్రిస్టెనా ఆవేదన వ్యక్తం చేసింది.క్రిస్టెనా అనుమానం నిజమేనని తేలింది.
ఆమె ఇంటి వద్దనే DNA పరీక్ష చేయించుకుంది.ఆ రిపోర్ట్ చూడగానే ఆమె కళ్లు తేలేసింది.
ఆ బిడ్డ తన సొంత బిడ్డ కాదని తేలింది.వెంటనే ఆమె ఫెర్టిలిటీ క్లినిక్‌కు ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పింది.
క్లినిక్ వాళ్లు కంగారు పడి అసలు తల్లిదండ్రులను వెతికి పట్టుకున్నారు.
అసలు నిజం తెలిసినా కూడా క్రిస్టెనా ఆ బిడ్డను సొంత బిడ్డలాగే చూసుకుంది.
ఎన్నో నెలల పాటు ఆ బిడ్డ ఆలనాపాలనా చూసింది.తన బిడ్డకు పాలిచ్చి పెంచింది.
వైద్య పరీక్షలకు తీసుకెళ్లింది.ఎవరి కంట పడకుండా కంటికి రెప్పలా కాపాడుకుంది.
కానీ మనసులో మాత్రం “అసలు తల్లిదండ్రులు నా బిడ్డను లాక్కుపోతారేమో?” అని భయపడుతూ రోజులు గడిపింది.

చివరికి ఆ బిడ్డ అసలు తల్లిదండ్రులు ఎవరో తెలిసింది.వాళ్లు తమ బిడ్డను తమకు ఇవ్వాలంటూ కోర్టులో కేసు వేశారు.క్రిస్టెనా ఆ బిడ్డను వదులుకోవడానికి ఏమాత్రం ఇష్టపడలేదు.
కానీ న్యాయం ఆమె వైపు లేదు.న్యాయపరంగా ఆమెకు ఎలాంటి హక్కులు లేవని లాయర్లు తేల్చి చెప్పారు.తీవ్ర బాధతో ఆ బిడ్డను నిజమైన తల్లిదండ్రులకు అప్పగించడానికి ఒప్పుకుంది.
“నా బిడ్డలో నా రక్తం లేకపోవచ్చు.కానీ వాడు ఎప్పటికీ నా కొడుకే.వాడిని నేను ఎప్పటికీ మిస్ అవుతూనే ఉంటాను” అంటూ కన్నీటి పర్యంతమైంది క్రిస్టెనా.క్రిస్టెనా ఇప్పుడు కోస్టల్ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్స్ క్లినిక్‌పై కోర్టులో కేసు వేసింది.క్లినిక్ నిర్లక్ష్యం వల్లే తన జీవితం ఇలా మారిపోయిందని ఆమె ఆరోపిస్తోంది.
తన అనుమతి లేకుండానే తనను సరోగేట్ మదర్‌గా మార్చేశారని మండిపడింది.
న్యాయం కోసం కోర్టుకు వెళ్లింది.
జ్యూరీ విచారణ జరపాలని, కనీసం 75 వేల డాలర్లు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తోంది.తనకు జరిగిన ఈ ఘోరం ఇంకెవరికీ జరగకూడదని, IVF చికిత్సలో ఉండే ప్రమాదాల గురించి అందరికీ తెలియాలనే ఉద్దేశంతోనే తాను కోర్టుకు వెళ్తున్నానని చెప్పింది.“తల్లిని కావాలని నేను ఎన్నో కలలు కన్నాను.నాకు జరిగిన ఈ దారుణం ఇంకెవరికీ జరగకూడదు” అంటూ కన్నీళ్లు పెట్టుకుంది క్రిస్టెనా.







