సూర్యాపేట జిల్లా: సూర్యాపేట ఎమ్మేల్యే, మాజీ మంత్రి జగదీష్ రెడ్డిని సూర్యాపేట నియోజగవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ,మాజీ మంత్రి రామిరెడ్డి దామోదర్ రెడ్డి నియోజకవర్గ అభివృద్ధిపై చర్చకు రావాలని మరోసారి బహిరంగ సవాల్ విసిరారు.శనివారం చివ్వేంల మండలంలోని ఉర్లుగొండ,తుల్జారావుపేట, గుంపుల,తిరుమలగిరి, గుంజలూరు గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ నల్లగొండ పార్లమెంట్ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి రెండు పర్యాయాలు పదేళ్ళు మంత్రిగా పని చేశారు.విద్యాశాఖ మంత్రిగా ఉండి కనీసం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల తీసుకురాలేదు.
విద్యుత్ శాఖ మంత్రిగా ఉండి నియోజకవర్గానికి ఎన్ని ట్రాన్స్ఫార్మర్లు ఇచ్చారో చెప్పాలి? నువ్వు వేసిన రోడ్డు ఎన్ని?తీసిన కాలువలెన్ని?ఎంతమందికి డబల్ బెడ్ రూమ్ ఇళ్లు అందించావు?మూడెకరాల భూమి ఎంతమందికి ఇచ్చావు?దళిత బంధు ఎన్ని యూనిట్లు మంజూరు చేశావు? సద్దల చెరువు సుందరీకరణ పేరుతో జరిగిన అవినీతి ఎంత?రోడ్ల విస్తరణలో వాస్తవ పరిస్థితి ఏమిటి?కాంట్రాక్టులన్నీ చేసిందెవరు? మెడికల్ కాలేజీలో మాయాజాలం ఏంటి? ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల నియామకాల బాగోతం ఏమిటి? ఈ పదేళ్లలో కాంట్రాక్టులు కమీషన్లు మినహాయించి ఇక్కడ జరిగిన అభివృద్ధి ఎక్కడో చెప్పాలని డిమాండ్ చేశారు.
రెండు ఎకరాల భూమి ఉన్న నువ్వు రెండు వేల కోట్లకు ఏవిధంగా ఎదిగావో ప్రజలకు చెప్పాలని, వీటన్నిటిపై బహిరంగ చర్చకు సిద్ధమని చెప్పినా కూడా దానిపై ఎమ్మెల్యే స్పందన కరువైందని ఎద్దేవా చేశారు.
కాంగ్రేస్ పార్టీకి ఓటువేసి అభివృద్ధికి బాటలు వేయాలని,కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటా, నాలుగు తరాలుగా కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని రాజకీయాల్లో ముందుకు సాగుతున్నానని గుర్తు చేశారు.కాంగ్రెస్ పార్టీతోనే గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి సాధ్యమన్నారు.
సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పిన బీజేపీ యువతను, నిరుద్యోగులను మోసం చేసిందన్నారు.దేవుని పేరు చెప్పుకొని బీజేపీ మత రాజకీయాలు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం బీఆర్ఎస్ కంటే ముందే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అంశాన్ని లేవనెత్తానన్నారు.తెలంగాణ రాష్ట్రం కోసం తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ ఢిల్లీకి పిలిపించి కాంగ్రెస్ పార్టీతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అవుతుందని హామీ ఇచ్చారని,ఆ హామీ ప్రకారమే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిందని చెప్పారు.
టిఆర్ఎస్ నాయకులు ఉద్యమాలు చేస్తే తెలంగాణ రాష్ట్రం రాలేదని,కాంగ్రెస్ పార్టీ ఇస్తేనే వచ్చిందన్నారు.చెప్పిన ప్రతి హామీని అర్హులైన ప్రతి ఒక్కరికి అందజేయడమే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లక్ష్యమన్నారు.
ఈ నెల 13న జరిగే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుందూరు రఘువీరారెడ్డికి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.