సూర్యాపేట జిల్లా:మఠంపల్లి మండలం మట్టపల్లి పోస్ట్ అఫిసుకు వచ్చిన ఉత్తరాలు,మూడు గోనె సంచుల్లో పోస్ట్ ఆఫీస్ కార్యాలయం ముందు చెత్తకుప్పలా పడివున్న దృశ్యం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.మట్టపల్లి పోస్ట్ ఆఫీసు నుండి రామచంద్రపురం తండా,బొజ్జతండా,కృష్ణాతండా తదితర గ్రామ పంచాయతీల ప్రజలకు ఉత్తరాలు వస్తాయి.
వచ్చిన ఉత్తరాలను సంబంధిత వ్యక్తులకు,కార్యాలయాలకు చేరవేయకుండా పోస్టు మాస్టర్,పోస్ట్ మెన్ నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఈ చెత్త కుప్పలుగా పడి ఉన్న ఉత్తరాలను చూస్తే అర్ధమవుతుంది.ఈ విధంగా వచ్చిన ఉత్తరాలను పంపిణీ చేయకుండా,చెత్త కాగితలుగా మార్చడాన్ని వ్యతిరేకిస్తూ సంబంధిత గ్రామాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
గత మూడు నెలలుగా తమకు రావాల్సిన వివిధ రకాల సమాచారాలు,ఉత్తరాలు ఇతర ఉపయుక్తకరమైన కార్డులు రాకపోవడంతో గ్రామస్థులకు అనుమానం వచ్చి పోస్ట్ ఆఫీసుకు వెళ్లి చూడగా మూడు బస్తాల్లో ఉత్తరాలు,విలువైన సమాచారం గల పత్రాలు చిందర వందరగా పడి ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.అక్కడికి వెళ్ళిన వారు తమకు కావాల్సినవి అందులో నుండి ఏరుకొని మిగిలినవి వదిలేసి వెళ్ళారని తెలుస్తోంది.
విధుల్లో నిర్లక్ష్యం వహించి ఉత్తరాలను ఉ(చె)త్త కాగితాలుగా మార్చిన పోస్ట్ మాస్టర్ ను,పోస్ట్ మ్యాన్ ను సస్పెండ్ వెంటనే చేయాలని భాదితులు డిమాండ్ చేస్తున్నారు.







