సూర్యాపేట జిల్లా:మీ కడుపున పుట్టిన బిడ్డగా మీ ముందుకు వస్తున్నా, ప్రతీ తల్లి ఓటుతో ఆశీర్వదించాలని బీఎస్పీ సూర్యాపేట ఎమ్మెల్యే అభ్యర్థి వట్టే జానయ్య యాదవ్( Vatte Janaiah Yadav ) అన్నారు.సోమవారం జిల్లా కేంద్రంలోని కుడకుడలోనిమ్యాక్స్ ఆఫీస్ కార్యాలయంలో నిర్వహించిన అంత్యోదయ మహిళ పరస్పర సహాయ సహకార పొదుపు సంఘం ప్రతినిధుల మహాసభలో ఆయన పాల్గొని మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాలు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకుంటే అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం పేద ప్రజలను గౌరవించడం లేదన్నారు.
ధనిక రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణను బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుల కుప్పగా మార్చిందన్నారు.పావలా వడ్డీ పేరుతో మహిళా సంఘాలను కేసీఆర్ ప్రభుత్వం పదేళ్లుగా మోసం చేస్తుందన్నారు.పావలా వడ్డీ రుణాలు మంత్రి ఇంటి నుంచి ఇచ్చేవి కావని,మనం పన్ను రూపంలో చెల్లిస్తే వచ్చే ఆదాయం నుంచి బ్యాంకులు మహిళలకు రుణాలు ఇస్తున్నాయని, మహిళా చైతన్యం గ్రహించి ప్రభుత్వం ఏర్పాటు అయితే రూ.3000 ఇస్తామని మోసపూరిత మాటలు చెబుతున్నారని, ఇలాంటి మాటలు మహిళలు నమ్మవద్దని, రానున్న ఎన్నికల్లో మంత్రి జగదీష్ రెడ్డికి తగిన బుద్ధి చెప్పాలన్నారు.46వ జీవో ద్వారా నల్గొండ జిల్లా యువత ఉద్యోగాలు రాక తీవ్ర ఇబ్బందులు పడుతుంటే మంత్రి జగదీష్ రెడ్డి మాత్రం కనీసం పట్టించుకోలేదని ఆరోపించారు.ఇంటికొక ఉద్యోగం పేరుతో గతంలో మోసం చేశారని,అదే ఇంటికొక ఉద్యోగం ఉంటే రూ.2000 పింఛన్ అవసరం లేదన్నారు.