సూర్యాపేట జిల్లా:ఢిల్లీలో మహిళా మల్లయోధులు చేస్తున్న న్యాయ పోరాటానికి మద్దతు ఇవ్వాలని ఐఎఫ్టియు జాతీయ కమిటీ 2023 మే 15న ఇచ్చిన పిలుపు మేరకు సోమవారం జిల్లా అదనపు కలెక్టర్ మోహన్ రావుకి ఐఎఫ్టియు, పివైఎల్,పిఓడబ్ల్యు సంఘాల అధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు రాష్ట్ర సహాయ కార్యదర్శి గంట నాగయ్య మాట్లాడుతూ అంతర్జాతీయ పోటీల్లో పథకాలను సాధించిన మహిళ మల్లయోధులను (రెజ్లర్లను),రెజ్లింగ్ ఆఫ్ ఇండియా ఫెడరేషన్ అధ్యక్షులు,లోక్ సభ సభ్యుడు అయిన బ్రిజ్ భూషణ్ సింగ్( Brij Bhushan ),లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఫిర్యాదులు చేసి, ఆందోళన చేస్తే కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని తెలిపారు.
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మహిళా రెజ్లర్లపై ఈనెల మూడవ తేదీ రాత్రి పోలీసులు దురుసుగా ప్రవర్తించడం ఆశ్చర్యంగా ఉందన్నారు.లోక్ సభ సభ్యుడైన బ్రిజ్ భూషన్ పై చర్య తీసుకోకుండా బాధితులపైనే పోలీసులు విరుచకపడడం,బీజేపీ ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేస్తుందన్నారు.
బీజేపీ ప్రభుత్వం నేరస్తులకు అండగా నిలవడం సిగ్గుచేటన్నారు.
మహిళా రెజ్లర్లకు( Female Wrestlers )ప్రజల నుండి వస్తున్న సానుభూతి, మద్దతుకు భయపడి ఎఫ్ఐఆర్ నమోదు చేసి కూడా అతనిపై చర్య తీసుకోకపోవడం దుర్మార్గమని అన్నారు.
బేటిబచావో బేటి పడావో అన్న మోడీ( Narendra Modi ) మాటలు నీటి మూటలేనని నిర్ధారణ అయిందన్నారు.బాధితుల్లో మైనర్లు ఉండటం వల్ల వెంటనే పోక్సో చట్టం కింద నిందితుడిని అరెస్టు చేసి, సమగ్ర దర్యాప్తు చేసి నేరస్తులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
మహిళ క్రీడాకారులకు రక్షణ కల్పించాలని,లేనిచో దేశ జనాభాలో సగ భాగమైన మహిళల కోపాగ్నికి బలికాక తప్పదని గంట కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.ఢిల్లీలో మహిళా క్రీడాకారులను రక్షణ కల్పించలేని మోడీ ప్రభుత్వం,అసత్యాలతో ఊరేగుతుందని అన్నారు.
ఈ సమావేశంలో ఐఎఫ్టియు జిల్లా ఉపాధ్యక్షులు కుణుకుంట్ల సైదులు,పివైఎల్ జిల్లా అధ్యక్షులు నల్లగొండ నాగయ్య,పిఓడబ్ల్యు జిల్లా ప్రధాన కార్యదర్శి కె.నర్సమ్మ,పివైఎల్ నాయకులు బండి రవి తదతరులు పాల్గొన్నారు.