సూర్యాపేట జిల్లా:సూర్యాపేట జిల్లా కేంద్రం అభివృద్ధి మాటున జరిగిన అంతులేని అవినీతిని ప్రశ్నించినందుకే తనను పార్టీ నుంచి బహిష్కరించారని 32వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ ( BRS Councillor )కొండపల్లి నిఖిల భర్త,బీఆర్ఎస్ జిల్లా నాయకులు కొండపల్లి దిలీప్ రెడ్డి( Kondapally Dilip Reddy ) అన్నారు.సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కౌన్సిలర్ నిఖిలకు మద్దతుగా 15 మంది బీఆర్ఎస్ అసమ్మతి కౌన్సిలర్లు మూకుమ్మడిగా ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
బీఆర్ఎస్ పార్టీలో కష్టపడి పనిచేసే వారికి విలువ లేదన్నారు.జనంలో మంచిగా ఓ వ్యక్తి ఎదిగితే జగదీష్ రెడ్డికి నచ్చదని, ఎలాగైన సరే అణిచివేస్తారని ఆరోపించారు.
అవినీతిని ప్రశ్నిస్తే పార్టీ నుంచి బహిష్కరిస్తారా? పదేళ్ల నుంచి పని చేసిన మాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా అని ప్రశ్నించారు.కనీసం మా వార్డులో జరిగిన అభివృద్ధి పనుల్లో శిలా ఫలకాలపై కౌన్సిలర్ల పేరు పెట్టేందుకు కూడా అంగీకరించలేదన్నారు.
బీఆర్ఎస్ పార్టీ( BRS party ) అహంకారానికి రాష్ట్ర ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని,ఇక్కడ అలాంటి సమయం వస్తుందన్నారు. జగదీష్ రెడ్డి( Jagadish Reddy ) మూడుసార్ల గెలుపులో మేము కీలకపాత్ర పోషించామని, మున్సిపాలిటీలో తప్ప ఆయనకి ఎక్కడా ఓట్లు పడలేదన్నారు.
మేం వార్డులో ఉంటామని ప్రజల మనుషులుగా చలామణి అవుతామని ప్రజా సమస్యలపైనే అవిశ్వాసానికి వెళ్ళామన్నారు.బీఎస్పీలో చేరిన కృపాకర్ ను దగ్గరకు తీసుకున్న జగదీశ్ రెడ్డి మమ్మల్ని దూరంపెట్టి పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించడం విచారకరమన్నారు.
పట్టణ పార్టీ అధ్యక్షుడు సవరల సత్యనారాయణకు తమను బహిష్కరించేందుకు సంతకం చేసే అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉందన్నారు.మేమంతా కలిసికట్టుగా ఉంటామని భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామన్నారు.ఈ సమావేశంలో మున్సిపల్ కౌన్సిలర్లు బచ్చలకూరి శ్రీనివాస్,జహీర్,ఎలిమినేటి అభినయ్,అనపర్తి రాజేష్, అనంతుల యాదగిరి,రాపర్తి శ్రీనివాస్,మామిడి గౌరయ్య, జ్యోతి,రవి నాయక్, నాయకులు కరుణాకర్, గండూరి రమేష్,లింగా నాయక్,సిరివెళ్ల శబరి,కుంభం రాజేందర్,మకట్ లాల్ తదితరులు ఉన్నారు.







