సూర్యాపేట జిల్లా:ఆంధ్రా- తెలంగాణ సరిహద్దు జిల్లాగా, విజయవాడ-హైదరాబాద్ 65వ,జాతీయ రహదారిపై దినదినాభివృద్ధి చెందుతున్న పట్టణంగా సూర్యాపేట జిల్లా( Suryapet District ) కేంద్రం నిత్యం రద్దీగా మారింది.ఈ పట్టణంలో జాతీయ రహదారి 8 కి.
మీ.మేర ఉండగా గత పదేళ్ల క్రితం నాలుగులైన్ల రోడ్డు నిర్మాణంలో భాగంగా కేవలం 2 కి.మీ.మాత్రమే ఫ్లైఓవర్ నిర్మాణం చేశారు.వివిధ అవసరాల కోసం జిల్లా కేంద్రానికి వేలాది మందిప్రజలు, వాహనదారులు వచ్చిపోతూ ఉంటారు.ఫోర్ వే లైన్ కావడం వల్ల వేలాది భారీ వాహనాలు వేగంగా దూసుకొస్తుంటాయి.
ఈ సమయంలో రోడ్డు దాటే ప్రజలు,వాహనదారులు ప్రమాదాల బారిన పడుతూ మృత్యువాత పడుతున్నారు.దీనితో నిత్యం ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రయాణాలు చేస్తున్నారు.
ముఖ్యంగా దురాజ్ పల్లి, సూర్యాపేట వ్యవసాయ మార్కెట్,ఈనాడు ఆఫిస్, అంజనాపురి కాలనీ ఎక్స్ రోడ్, జనగాం ఎక్స్ రోడ్లలో ఫ్లైఓవర్ నిర్మాణం లేకపోవడంతో ప్రజలు,వాహనదారులు నరకం చూస్తున్నారు.ముఖ్యంగా దురాజ్ పల్లి,జనగామ క్రాస్ రోడ్ల గుండా జిల్లా కేంద్రానికి వచ్చేవారి సంఖ్య గణనీయంగా ఉండటంతో ఆ ప్రదేశాల్లో పదుల సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు( Road accidents ) జరిగి అనేక కుటుంబాలు చిన్నాభిన్నమయ్యాయి.
నూతనంగా నిర్మించిన సూర్యాపేట-ఖమ్మం హైవే జంక్షన్( Suryapet-Khammam Highway Junction ) లో కూడా ఫ్లై ఓవర్ నిర్మాణం మర్చిపోయారు.దీనితో ఖమ్మం-హైదరాబాద్ కు వెళ్ళే వాహనాలు వెనుకకు వచ్చి రాయినిగూడెం వద్ద యూ టర్న్ తీసుకొని వెళ్లాల్సి వస్తుంది.
ఇక్కడే శనివారం రాత్రి రాయినిగూడెం వద్ద ఆర్టీసి బస్సు,డీసీఎం వ్యాను ఢీ కొనడంతో 20మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి.జిల్లా కేంద్రంలో పూర్తిస్థాయిలో ఫ్లై ఓవర్ లేకపోవడంతో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని అనేక సార్లు విన్నవించినా గత ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని,ఇప్పుడు రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వమని చెబుతున్న పెద్దలైనా చొరవ తీసుకుని జిల్లా కేంద్రం సరిహద్దుల వరకు ఫ్లై ఓవర్ నిర్మాణం చేపట్టి ప్రజల ప్రాణాలు కాపాడాలని కోరుతున్నారు.