సూర్యాపేట జిల్లా:కోదాడ నియోజకవర్గ పరిధిలోని మోతె మండలం బుర్కచర్ల గ్రామంలో ఈ నెల 22వ తారీఖున పల్లె ప్రకృతి వనం,శ్మశానవాటిక వంటి వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడానికి వెళ్లిన కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పై ఆశా వర్కర్స్ పూలు చల్లుతూ స్వాగతం చెప్పడాన్ని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఓర్సు వేలంగి రాజు తీవ్రంగా ఖండించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సంఘటన చూసిన స్థానిక ప్రజలు,ప్రతిపక్ష నేతలు ఔరా అంటూ ముక్కున వేలేసుకున్నారని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఓర్సు వేలంగి రాజు తెలిపారు.
ఆశా కార్యకర్తలు గులాబీ కార్యకర్తలుగా మారి డ్రెస్ కోడ్ తో ఎమ్మెల్యేపై పూల వర్షం కురిపించటాన్ని ఆయన తీవ్రంగా తప్పు పట్టారు.ప్రభుత్వ సంస్థలో పని చేస్తూ ప్రజలు ఇచ్చే జీతాలు తీసుకుంటూ ప్రజలకు సేవ చేయాల్సిన ఆశాలు ఇలా ఎమ్మెల్యేకు భజన చేయడం ఏమిటని ప్రశ్నించారు.
ఓ ప్రజా ప్రతినిధిగా ఉన్న ఎమ్మెల్యే కూడా ఆ విషయాన్ని ఖండించకుండా చిరు నవ్వులు చిందిస్తూ పులకరించి పోవడం ఏమిటని ఎద్దేవా చేశారు.రాను రాను రాజు గుర్రం,గాడిద అయినట్లు,తెలంగాణ రాష్ట్రంలో పార్టీ కార్యకర్తలెవరో, ప్రభుత్వ ఉద్యోగులెవరో తెలియని పరిస్థితి దాపురించిందని ఆరోపించారు.
ప్రజాస్వామ్య వ్యవస్థకు ఇది చెడు సంకేతాలు ఇస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.దీనిపై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు,ఈ ఘటనపై విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని కోరారు.