ఆరోగ్యం అంటే కేవలం మంచి ఫిజిక్ తో, ఎలాంటి శారీరక రోగం లేకుండా ఉండటమే కాదు.మనసు కూడా బాగుండాలి.
మెదడులో మంచి ఆలోచనలు మెదులుతూ ఉండాలి.ఈరోజుల్లో శరీరంతో పాటు మనసు, మెదడు ప్రశాంతంగా ఉండటం చాలా అవసరం.
మునుపెన్నడు లేని విధంగా ఇప్పుడు డిప్రెషన్ కేసులు పుట్టుకొస్తున్నాయి.డబ్బు, పేరు ఉన్న పెద్ద పెద్ద సినిమాతారలు కూడా డిప్రెషన్ బాధితులే.
మనసు ఓ చోట ఉండకపోవడం, ఎప్పుడు నెగెటివ్ అలోచనలు రావడం, ఏదో కోల్పోయినట్లు ఉండటం కూడా అనారోగ్యమే.
మన దేశ జనాభాలో దాదాపు పదికోట్లు మంది డిప్రెషన్, మానసిక సమస్యలతో బాధపడుతున్నారట.
రానురాను ఇది ఎక్కువే అవుతోంది తప్ప తగ్గట్లేదు.మరీ ముఖ్యంగా ఈ మానసిక సమస్యలు అర్బన్ ఏరియాలు, అంటే సిటీల్లో ఎక్కువ.
కారణాలు చాలా సుస్పష్టం.పని ఒత్తిడి, ఆత్మీయిలతో మాట్లాడే తిరిక లేకపోవడం.
కష్టమొస్తే చెప్పుకునే మనుషులు లేకపోవడం, చెప్పే వీలుంటే, అర్థం చేసుకునే మనుషులు లేకపోవడం, ఇలాంటి సమస్యలే మానసిక అశాంతికి కారణమవుతాయి.సమస్య పెద్దగా అవుతున్నా కొద్దీ జీవితంపై విరక్తి పుడుతుంది.
అందుకే సూసైడ్ రేట్ లో మన దేశం 12వ స్థానంలో ఉంది.
ఈ సూసైడ్ కేసుల్లో అత్యధిక శాతం 16-30 ఏళ్ళ వయసులో ఉన్నవారే.
అయినా, ప్రభుత్వాలు మానసిక సమస్యలను చిన్నచూపే చూస్తున్నాయి.బడ్జెట్ లో కేవలం 0.6% మాత్రమే మానసిక ఆరోగ్యానికి కేటాయిస్తోంది ప్రభుత్వం.అలాగని తప్పు పూర్తిగా గవర్నమెంటుపై వేయలేం కదా.మానసిక సమస్యలు కంటికి కనబడనివి.ఒకరితో పంచుకుంటే తప్ప తెలియడం కష్టం.
కాని క్యాన్సర్, డయాబెటిస్ లాగా ఈ సమస్యలు కూడా ప్రతీ ఏడాది లక్షలకొద్దీ ప్రాణాలు తీసుకుపోతున్నాయి.అందుకే కేవలం శరీరాన్నే కాదు, మనసుని, ఆలోచనల్ని కూడా ఆరోగ్యంగా ఉంచుకోండి.
వస్తువులు జీవితంలో భాగమే, కాని మనుషులకి దగ్గరవ్వండి.