సూర్యాపేట జిల్లా:తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య జీవితం నేటి తరానికి ఆదర్శమని సూర్యాపేట వామపక్ష నేతలు ఉద్ఘాటించారు.తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య 76వ వర్ధంతి సందర్భంగా సోమవారం జిల్లా కేంద్రంలో వామపక్షాల ఆధ్వర్యంలో ఆయన వర్ధంతి సభ నిర్వహించారు.
ఈ సందర్భంగా అమరజీవి దొడ్డి కొమరయ్య చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం వారు మాట్లాడుతూ నాటి తెలంగాణ రైతంగ సాయుధ పోరాటంలో కీలకపాత్ర పోషించి ఆనాటి దొరలకు వ్యతిరేకంగా పోరాడి వీరమరణం పొందిన తొలి అమరుడు దొడ్డి కొమరయ్య అని కొనియాడారు.
కడవెండి గ్రామంలో విసునూరు దొరకు వ్యతిరేకంగా భీమిరెడ్డి నరసింహారెడ్డి నాయకత్వంలో జరిగిన ఆనాటి పోరాటంలో వేలాది ఎకరాల భూమి పేద ప్రజలకు పంచి,దొరల కబంధహస్తాల నుండి చాకలి ఐలమ్మ పంట పొలాన్ని కాపాడిన ఘనత దొడ్డి కొమురయ్య దని గుర్తు చేశారు.దొడ్డి కొమురయ్య జీవితం నేటి తరం ఆదర్శంగా తీసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సభలో ఎంసిపిఐయు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వరికుప్పల వెంకన్న, సిపిఐ (ఎంఎల్) రామచంద్రన్ రాష్ట్ర అధికార ప్రతినిధి బుద్ధ సత్యనారాయణ,బహుజన కమ్యూనిస్టు పార్టీ (బీసీపీ) సూర్యాపేట జిల్లా కార్యదర్శి చామకూరి నరసయ్య,ఎంసిపిఐయు సూర్యాపేట జిల్లా కార్యదర్శి ఎస్.కె.నజీర్,పడిశాల భాస్కర్,చిట్టిబాబు, లింగంపల్లి ఓంకార్,చిక్కుల రవికుమార్,లింగంపల్లి రాజు,సంతోష్ తదితరులు పాల్గొన్నారు.