సూర్యాపేట జిల్లా: జిల్లాలో గంజాయి నిరోధానికి, గంజాయికి అలవాటు పడ్డవారిని గుర్తించడానికి పోలీస్ స్పెషల్ ఫోకస్ పెట్టి, ప్రత్యేక టీమ్స్ ఏర్పాటు చేశామని సూర్యాపేట జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే తెలిపారు.జిల్లా పోలీస్ కార్యాలయం నుండి ఎస్పీ ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు.
గంజాయి సమాజంలో యువశక్తిని నిర్వీర్యం చేస్తుంది.దీని మూలాలను సమూలంగా నాశనం చేయడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యతన్నారు.
గంజాయి నిరోధానికి పట్టిష్టంగా పనిచేస్తున్నామని, యువత గంజాయి మత్తుకు బానిసలు కావొద్దని,విద్యార్థులు, యువకులు ఎవరైనా గంజాయి మత్తుకు అలవాటు పడ్డారా అనేది తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు గమనించి పోలీసు వారికి సమాచారం ఇవ్వాలని కోరారు.
గంజాయి నివారణలో భాగంగా గతంలో గంజాయి రవాణాకు పాల్పడిన నేరస్తులను,గంజాయి వినియోగానికి అలవాటు పడిన వ్యక్తులను, యువతను గమనిస్తున్నామని,వారిపై నిఘా ఉంచామన్నారు.
గంజాయి రవాణా చేసే వారిని,గంజాయి వినియోగిస్తున్న వారి సమాచారాన్ని పోలీసు వారికి తెలియజేయాలని కోరారు.గత సంవత్సర కాలంగా గంజాయి నిరోధంపై ఉక్కుపాదం మోపుతూ జిల్లా పోలీస్ శాఖ 650 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకొని,25 కేసులు నమోదు చేసి,59 మందిని అరెస్టు చేయడం జరిగిందని,ఇందులో ఒకరిపై పిడి యాక్ట్ నమోదు చేశామని వివరించారు.