సూర్యాపేట జిల్లా:టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారబోతుందన్న చర్చ రాష్ట్రంలో జోరుగా సాగుతున్న నేపథ్యంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.ప్రజలే దేశ నిర్మాతలని, ప్రజలు తలచుకుంటే ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతారని అన్నారు.
బుధవారం జిల్లా కేంద్రంలోని కాసరబాద్ రోడ్ లో స్ఫూర్తి వనం వద్ద కల్నల్ సంతోష్ బాబు రెండవ వర్ధంతి సందర్భంగా సంతోష్ బాబు కాంస్య విగ్రహాన్న మంత్రి జగదీష్ రెడ్డి ఆవిష్కరించి,ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా మారే అంశంపై స్పందించారు.
దేశాన్ని అభివృద్ధి బాట పట్టించి,భావి తరాలకు కావాల్సిన విధంగా సరైన దిశానిర్దేశం చేయడంలో జాతీయ పార్టీలు విఫలం చెందాయని అన్నారు.ఈ నేపథ్యంలోనే కేసీఆర్ కొత్త పార్టీ ఆలోచన చేస్తున్నారని వెల్లడించారు.
ఇన్ని ఏళ్లుగా పరిపాలించిన కాంగ్రెస్,బీజేపీ పార్టీలు దేశ భవిష్యత్తుకు కావాల్సిన పునాదులు వేయలేకపోయారని,దేశ సమగ్రాభివృద్ధికి కావాల్సిన సహజ వనరులు పుష్కలంగా ఉన్నా వాటిని ఉపయోగించుకోలేని దుస్థితికి దేశాన్ని ఈ రెండు పార్టీలు తీసుకొచ్చాయని విమర్శించారు.బీజేపీ పాలనలో దేశం మధ్య రాతియుగం దిశగా పయనిస్తుందని,దేశాభివృద్ధిని మరచి ఓట్ల కోసం ప్రజల మధ్య వైషమ్యాలను సృష్టించి లబ్ది పొందాలని చూస్తుందన్నారు.
మరో పక్క కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా విఫలమైందని,దేశ పరిస్థితి రోజురోజుకీ దిగజారుతున్న నేపథ్యంలో ఇప్పుడు దేశానికి ప్రత్యామ్నాయ అజెండా తీసుకొచ్చే శక్తుల కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని చెప్పారు.ఎనిమిదేళ్లలో తెలంగాణా రూపురేఖల్ని మార్చిన విధంగానే భావితరానికి కోత్త అజెండాతో కేసీఆర్ రాబోతున్నారని అన్నారు.
కేసీఆర్ పిలుపుపట్ల దేశ వ్యాప్తంగా మద్దతు లభిస్తుందని,దేశంలో ఒక చర్చ నడుస్తుందని,త్వరలోనే దేశ రూపురేఖల్ని మార్చే అజెండా ప్రకటన కేసీఆర్ చేస్తారని తెలిపారు.జాతీయ పార్టీ పెడతానంటూ కేసీఆర్ పగటికలలు కంటున్నారన్న బీజేపీ తెలంగాణా ఇంచార్జ్ తరుణ్ చుగ్ వ్యాఖ్యలపై మంత్రి స్పందిస్తూ అందరి కలల్ని నిజం చేసేది ప్రజలేనని,కేసీఆర్ అజెండా నచ్చితే ప్రజలు ఆశిర్వదిస్తారని,ఎవ్వరిని ఎక్కడ కూర్చోబెట్టాలో ప్రజలే నిర్ణయిస్తారని వ్యాఖ్యానించారు.
ఈ కార్యక్రమంలో సంతోష్ బాబు తల్లిదండ్రులు బిక్కుమల్ల ఉపేందర్,మంజుల,కుటుంబ సభ్యులు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు.