సూర్యాపేట జిల్లా:జిల్లాలోని వినియోగదారులు కొనుగోలు చేసే వస్తువులపై అధిక ధరలు వసూలు చేస్తే చర్యలు తప్పవని అదనపు కలెక్టర్ ఎస్.మోహన్ రావు అన్నారు.
శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులు,నిత్యావసర వస్తువుల విక్రయ డీలర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో డి.ఎస్.ఓ.విజయలక్ష్మితో కలసి పాల్గొన్నారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల ఉక్రెయిన్,రష్యా యుద్ధం వలన వంటనూనెల దిగుమతులు కొరత ఏర్పడుతున్నందున,రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు లోబడి వివిధ వస్తువులను కొనుగోలు చేసే వినియోగదారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సంబంధిత శాఖల అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు.అన్ని నిత్యవసర దుకాణాలలో నిల్వలతో పాటు,విక్రయ ధరల వివరాలను బోర్డుపై ఉంచాలని వ్యాపార డీలర్లను ఆదేశించారు.
అలాగే జిల్లా అంతటా అధికారులు నిరంతర పర్యవేక్షణ చేయడంతో పాటు, ఎప్పటికప్పుడు నివేదికలు అందించాలని ఆదేశించారు.దుకాణాలలో వ్యాపారులు అధిక నిల్వలు,కృత్రిమ కొరత చూపితే అలాగే తూకాలలో మోసం జరిగితే చర్యలు తప్పవని ఈ సందర్బంగా హెచ్చరించారు.
ఈ సమావేశంలో జిల్లా తూనికలు, కొలతల అధికారి వెంకటేశ్వర్లు,ఏ.ఎస్.ఓ పుల్లయ్య, వ్యాపార డీలర్లు తదితరులు పాల్గొన్నారు.