నల్లగొండ జిల్లా:కులం పేరుతో దూషించడమే కాకుండా దాడి చేసి గాయపరిచిన ముగ్గురికి ఆరు నెలల జైలు శిక్ష,వెయ్యి రూపాయల జరిమానా విధిస్తూ జిల్లా అదనపు సెషన్స్ అండ్ ఎస్సీ,ఎస్టీ కోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది.ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలం కుక్కడం గ్రామపంచాయతీ పరిధిలోని చింతలగూడెం గ్రామానికి చెందిన నకిరేకంటి శ్రీనివాస్ హార్వెస్టర్ సహాయంతో తన వరి పొలం కోసేందుకు పక్కనున్న బీడు మడి నుండి వెళ్తుండగా అదే గ్రామానికి చెందిన బంటు సైదిరెడ్డి,బంటు మహేందర్ రెడ్డి,బంటు లక్ష్మమ్మలు కులం పేరుతో దూషించి,అకస్మాత్తుగా దాడి చేసి బలంగా కొట్టి గాయపరిచారు.
ఈ విషయమై బాధితుని భార్య నకిరేకంటి రజిత మాడుగులపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కేసు విచారించిన అప్పటి మిర్యాలగూడ డిఎస్పీ వెంకటేశ్వరరావు ముగ్గురు నిందితులపై ఎస్సీ,ఎస్టీ చట్ట ప్రకారం చార్జిషీటును కోర్టులో దాఖలు చేశారు.
న్యాయస్థాన విచారణలో నేర నిర్ధారణ కావడంతో కులం పేరుతో దూషించినందుకు ఎస్సీ,ఎస్టీ చట్ట ప్రకారం తలా 6 నెలల జైలు శిక్ష, వెయ్యి రూపాయల జరిమానా విధిస్తూ ఎస్సీ,ఎస్టీ కేసుల విచారణ కోర్టు న్యాయమూర్తి రోజారమణి తీర్పునిచ్చారు.క్లాసిఫికేషన్ తరఫున పిపి అఖిల యాదవ్ వాదించగా,నరేందర్ మల్లికార్జునులు సహకరించారు.