సూర్యాపేట జిల్లా:అధికార మదంతో,అంగబలంతో అహంభావంగా రాజ్యాంగాన్ని బాజాప్త మారుస్తాం సెక్యులర్ పదమే ఉండనీయం అంటూ బలుపు వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ అరవింద్ వ్యాఖ్యలను దేశభక్తులైన ప్రతీ ఒక్కరూ ఖండించాలని,ఆయనపై రాజద్రోహాకింద కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపెళ్లి సైదులు శనివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.గతంలో కేసీఆర్ మాట్లాడినప్పుడు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ రాజ్యాంగం జోలికి వస్తే నిన్ను తుకడ తుకడ చేస్తాం,రాజ్యాంగాన్ని ముట్టుకొని చూడు బిడ్డ అని గట్టిగా వ్యాఖ్యానించాడని ఇప్పుడు మీ బీజేపీ ఎంపీ అరవింద్ ను కూడా తుకడ చేస్తారా అని ప్రశ్నించారు.
కేసీఆర్ ది కేవలం నోటిదూల మాత్రమేనని కానీ,వాస్తవంగా రాజ్యాంగాన్ని మార్చి మను ధర్మశాస్త్రాన్ని రాజ్యాంగంగా ప్రవేశపెట్టాలనుకునే రాజకీయసిద్ధాంతం కలిగిన ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లో ఉన్న పార్టీ బీజేపీ అని చెప్పారు.అరవింద్ వ్యాఖ్యలు కేవలం ఆయన వ్యక్తిగతం కాదని,అది బీజేపీ విధానమని చెప్పారు.
రాజ్యాంగం రద్దు చేయడానికి ఇప్పటికే దాని మౌలిక పునాదులు పెకిలించిందన్నారు.దళిత,గిరిజన,బలహీన వర్గాలకు మహిళలకు రాజ్యాంగంకల్పించిన కొద్దిపాటి హక్కులు కూడా లేకుండా చేయడానికి రాజ్యాంగం అడ్డుగా ఉండడం వల్లే బీజేపీ దానిని మార్చజూస్తుందన్నారు.
ఇప్పుడు సామాజిక సంఘాలు,ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు ఎంపీ అరవింద్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించాలన్నారు.అదే నిజమైంది ఇది కేవలం ఎంపీ అరవింద్ మాట మాత్రమే అనుకుంటే పోరపాటు,ఇది బీజేపీ రాజకీయ సైద్ధాంతిక విధానం అనేది గుర్తెరుగాలన్నారు.
దళితులు,గిరిజనులు, బలహీనవర్గాలు,మహిళలు,మైనార్టీల పాలిట బీజేపీ ఎలా శత్రువో ఇప్పటికైనా అర్థం చేసుకోవాలన్నారు.ఎంపీ అరవింద్ వ్యాఖ్యలను వ్యవసాయ కార్మిక సంఘం తీవ్రంగా ఖండిస్తుందన్నారు.
ప్రజలు, ప్రజాస్వామిక వాదులు తీవ్రంగా ఖండించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.