నల్లగొండ జిల్లా:మర్రిగూడ మండలం శివన్నగూడ గ్రామంలో పశువుల ఆసుపత్రి ఉన్నా పశువైద్యం మాత్రం అందని ద్రాక్షలా మారిందని, ఎప్పుడు చూసినా తాళం వేసి ఉంటుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఈ ఆసుపత్రిలో సరిపడా సిబ్బంది లేరని,ఒక డాక్టర్,ఒక ప్రైవేట్ ఎంప్లాయ్ విధులు నిర్వహిస్తున్నా డాక్టర్ సమయపాలన పాటించకుండా ఇష్టారాజ్యంగా రావడంతో పశు వైద్యంపై నిర్లక్ష్యం కొనసాగుతోందని పాడి రైతులు ఆరోపిస్తున్నారు.
అత్యవసర సమయాల్లో డాక్టర్ లేకపోతే ఇక అంతే సంగతులని, పశువులతో వచ్చి ఎదురుచూపులు చూస్తూ పడిగాపులు కాస్తున్నామని, అయినా వస్తారనే నమ్మకం కూడా ఉండదని వాపోతున్నారు.సకాలంలో మూగజీవాలకు వైద్యం అందక మృత్యువాత పడుతున్నాయని,ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి డాక్టర్ సమయపాలన పాటించే విధంగా,మూగ జీవాలకు సకాలంలో వైద్యం అందేలా చూడాలని కోరుతున్నారు.
ఈ విషయంపై డాక్టర్ ను వివరణ కోరగా సరంపేట గ్రామంలో గాలికుంట వ్యాధి టీకాలు గోపాలమిత్ర,ప్రైవేట్ ఎంప్లాయ్ వేస్తున్నారు.నేను ఎస్టిఓ నాంపల్లిలో జీతం సంబంధించిన పనుల నిమిత్తం వచ్చానని సమాధానమిచ్చారు.బుధవారం ఎద్దు కాలుకు గాయం కావడంతో 10 గంటలకి ఆస్పత్రికి వచ్చానని శివన్నగూడెంకు చెందిన రైతు జంగిలి నర్సింహా అన్నారు.11:30 వరకు డాక్టర్,సిబ్బంది ఎవరు రాకపోవడంతో సిబ్బందికి ఫోన్ చేశాను.స్పందించక పోవడంతో చూసిచూసి వెళ్ళిపోయానని చెపుతున్నారు.