సూర్యాపేట జిల్లా:దూర ప్రయాణాలు చేసే వారు వివిధ బస్టాండ్ లలో ఏదైనా కొనాలంటే హడలిపోతున్నారు.బాహాటంగా అధిక రేట్లకు విక్రయిస్తూ,ఎమ్మార్పీ ధరల నిబంధనలు తమకు వర్తించవనే విధంగా వ్యవహరిస్తున్నారు.
ఎవరైనా ఇదేంటని అడిగితే చాలు మీమింతే ఇష్టమైతే కొను లేదంటే వెళ్లిపో అంటూ దబాయిస్తారు.ఇంకాస్త గట్టిగా అడిగితే దురుసుగా ప్రవర్తిస్తూ అవసరమైతే భౌతిక దాడులకు కూడా వెనుకాడరు.
ఇంత దారుణంగా ఆర్టీసీ బస్టాండ్లలో ఒక మాఫియాలా ప్రయాణికుల నుండి దోపిడీ జరుగుతుంటే పట్టించుకునే నాథుడే లేకపోవడం ఆశ్చర్యంగా ఉంది.ఆర్టీసీ బస్టాండ్ లలో షాపింగ్ పేరిట జరుగుతున్న దోపిడీ అంతా ఇంతా కాదు.ఒక బిస్కెట్ ఫ్యాకెట్ ధర ఎమ్మార్పీ రూ.5 ఉంటే రూ.10 లకు విక్రయిస్తారు.ఎమ్మార్పీ రూ.5 ఉందికదా అంటే ఇక్కడ ఎమ్మార్పీకి రావు,మేము వేలకు వేలు పెట్టి వేలం పాడుకొని షాపులు నడుపుతున్నామని,ఎమ్మార్పీకి అమ్మితే గిట్టుబాటు కాదని అంటుంటారు.ఇక ఎమ్మార్పీ ధరలు లేని ఇతర ఆహార పదార్థాలు,జ్యుస్ ల పరిస్థితి గురించి మాట్లాడే పరిస్థితే ఉందంటే అతిశయోక్తి కాదేమో!ఇంతకీ ఆర్టీసీ బస్టాండ్లలో షాపింగ్ ల టెండర్ ప్రక్రియలో జరుగుతున్న అసలు సంగతేంటి? వేలం పాట ద్వారా షాపులు కేటాయించి నిజంగానే అధిక రేట్లకు విక్రయాలు జరుపుకోవాలని ఆర్టీసీ వారే అనుమతులు ఇస్తున్నారా? ఒకవేళ యాజమాన్యం పాత్ర లేకుంటే ఎందుకు యథేచ్ఛగా దోపిడీ జరుగుతున్నా కనీసం అటు వైపు కన్నెత్తి కూడా చూడరు? బస్టాండ్లలో జరుగుతున్న నిలువు దోపిడీకి బాద్యులు ఎవరు? మరీ హైటెక్ బస్టాండ్లలో ఈ దోపిడీ విచ్చలవిడిగా జరుగుతుంది.ఇదేందని అడిగితే మీ ఇష్టం ఉన్నోనికి చెప్పుకోండని తిరిగి వారే ప్రయాణికులపై రుబాబు చేస్తూ,నిర్లక్ష్యంగా సమాధానం చెబుతారు.మరి వీరు ఇంతగా రెచ్చిపోవడానికి కారణం ఎవరు?ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా విక్రయాలు జరుపుతూ ప్రయాణికులను పీల్చిపిప్పి చేస్తున్నా ఆర్టీసీ యాజమాన్యం వారికి పట్టదా? అధిక ధరలకు విక్రయాలు జరుగుతున్నాయని ప్రయాణికులు మొత్తుకుంటుంటే సంబంధిత శాఖ అధికారులకు చెవికెక్కడం లేదా? లేక ఆర్టీసీ బస్టాండ్లలో విక్రయాలు వారి పరిధిలోకి రావా? సంవత్సరాల తరబడి సాగుతున్న ఈ అక్రమ వ్యాపారాలను అరికట్టేదెవరు? ప్రయాణికులకు భరోసా ఇచ్చేదెవరు? మీడియా,సోషల్ మీడియా కోడై కూస్తున్నా ఏమి తెలియనట్లుగా చోద్యం చూస్తున్న విధానాన్ని చూస్తుంటే దీని వెనుక పెద్ద మాఫియానే ఉన్నట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఇప్పటికైనా ఆర్టీసీయాజమాన్యం, సంబంధిత శాఖా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కొరుతున్నారు.