సూర్యాపేట జిల్లా:గత పదేళ్లుగా తిరుగులేని ఆధిపత్యన్ని ప్రదర్శించిన మాజీ మంత్రి,సూర్యాపేట ఎమ్మేల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి( Guntakandla Jagadish Reddy )కి అధికారం తారుమారు కాగానే సూర్యాపేట ( Suryapet )గులాబీ లీడర్లు ఊహించని ఝలక్ ఇచ్చారు.మున్సిపల్ చైర్ పర్సన్ ఒంటెద్దుపోకడలతో పలువార్డులలో అభివృద్ధి కుంటుపడిందని ఆరోపిస్తూ తిరుగుబాటు బావుటా ఎగురవేశారు.
ప్రజల మద్దతుతో గెలిచి వార్డు ప్రజలకు ఏమీ చేయలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని విసిగిపోయిన గులాబీ కౌన్సిలర్లు ప్రస్తుత చైర్ పర్సన్, వైస్ చైర్పర్సన్ పై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు రంగం సిద్దం చేశారు.
మొత్తం 48 మంది కౌన్సిలర్లు ఉండగా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి 9 మంది,బీఆర్ఎస్ పార్టీకి 30 మంది,బీఎస్పీ 4గురు,బీజేపీకి 4 గురు ఉన్నారు.47వ,వార్దు ఉపఎన్నిక జరగాల్సి ఉంది.గత ఎన్నికల్లో మున్సిపల్ చైర్ పర్సన్ జనరల్ మహిళ కేటాయించబడినా మంత్రి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మహిళకు ఇచ్చినా మద్దతు ఇచ్చామని,కానీ,సొంత పార్టీకి చెందిన వార్డులను కూడా నిర్లక్ష్యం చేయడం వల్ల విధిలేని పరిస్థితుల్లో అవిశ్వాస నోటీసు ఇచ్చామని చెబుతున్నారు.
బీఆర్ఎస్ చైర్మన్,వైస్ చైర్మన్ లపై అవిశ్వాసానికి తెరలేపిన తిరుగుబాటు చేసిన కౌన్సిలర్లు అంతా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అనుచరులే కావడం గమనార్హం.ఒకవేళ అవిశ్వాసం( Motion of no confidence ) పెట్టొద్దని తమపై ఒత్తిడి తెస్తే పార్టీ మారేందుకు కూడా వెనుకాడమనే సంకేతాలు ఇస్తున్నట్లు సమాచారం.
ఒకవేళ చైర్ పర్సన్ పై అవిశ్వాస తీర్మానం నెగ్గితే 31వ,వార్డు కౌన్సిలర్ కొండపల్లి నిఖిల చైర్పర్సన్ గా,వైస్ చైర్మన్ గా దళిత కౌన్సిలర్ కు ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.ఈ మేరకు కౌన్సిలర్లు అంతా ఒక అంగీకారానికి వచ్చిన తర్వాతే నోటీస్ అందజేసినట్లు తెలుస్తోంది.







