సూర్యాపేట జిల్లా:ఉమ్మడి నల్లగొండ జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ వట్టే జానయ్య యాదవ్ ( DCMS Chairman Vatte Janaiah Yadav )పై పోలీసులు పెట్టిన అక్రమ కేసులను వెంటనే విత్ డ్రా చేసుకోవాలని,జానయ్య ఎమ్మెల్యే కావడం ఎవరూ ఆపలేరని,సూర్యాపేటలో బహుజన విప్లవం రాబోతోందని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు.మంగళవారం రాత్రి జిల్లా కేంద్రంలోని గాంధీనగర్ వట్టే జానయ్య యాదవ్ కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చిన ఆయన బీఎస్పీ జిల్లా అధ్యక్షులు బుడిగె మల్లేష్ యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గాంధీనగర్ లో చీకట్లో ప్రెస్ మీట్ పెట్టుకునే దౌర్భాగ్యం వచ్చిందని,గాంధీనగర్ కు కరెంట్ సప్లై కూడా కట్ చేస్తున్నారని,జానయ్యను హత మార్చేందుకు కుట్ర చేస్తున్నారని,సూర్యాపేటను మంత్రి కాశ్మీర్ తలదన్నే విధంగా తయారు చేశారని ఆరోపించారు.
జానయ్య తల్లి ఐలమ్మను పరామర్శించడానికి వస్తే అడుగున వందలాది మంది పోలీసులతోటి నిర్బంధిస్తున్నారని, జానయ్యపై అక్రమ కేసులు పెట్టి వేధించడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు.యాదవ యుద్దభేరికి 150 కార్లతో జానయ్య పోతుంటే ఒక్క సూర్యాపేటకు సంబంధించిన కార్ల పైన కేసు పెట్టడం హేయమైన చర్య అన్నారు.
వట్టే జానయ్య కుమారుని వివాహానికి 50వేల మంది రావడం చూసి మంత్రి ఓర్వలేక ఆ రోజు నుంచి జానయ్యపై కుట్రకు తెరలేపారు అన్నారు.మంత్రి జగదీష్ రెడ్డి వట్టేజానయ్య అంటే ఎందుకు భయపడుతున్నారని, రాజకీయంలో వాటా అడిగితే కేసులు పెడతారా? ఎల్ల కాలం మీరే పాలించాలా? బీసీలు మీ కింద పని చేయాలా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్,పండగ సాయన్న,బెల్లి లలితక్క, బీసీల పోరాటస్ఫూర్తికి నిదర్శనమన్నారు.సీఎం కేసీఆర్,మంత్రి జగదీష్ రెడ్డి( CM KCR, Minister Jagdish Reddy ) సహకారంతోటే అక్రమ కేసులు పెడుతున్నారని, 30 వేల ఎస్సీ,ఎస్టీ,బీసీ భూములను లాక్కున్న కెసిఆర్ పై ఎన్ని కేసులు పెట్టాలని నిలదీశారు.
జానయ్యపై పెట్టిన కేసుల్లో ముద్దాయిగా మంత్రి జగదీష్ రెడ్డిని చేర్చాలని డిమాండ్ చేశారు.నాగారం మండలం కొత్తపల్లిలో 50 లక్షల విలువున్న భూములను కేవలం 10 లక్షలకే కొనుగోలు చేసి 20 ఎకరాలను గుంజుకున్నారని ఆరోపించారు.
కాంగ్రెస్, బీజేపీ పార్టీలో ఉన్న బీసీలు,ఒక బీసీ బిడ్డకు అన్యాయం జరుగుతుంటే ఎవరికి సపోర్ట్ చేయాలో నిర్ణయించుకోవాలని అన్నారు.మంత్రి జగదీష్ రెడ్డి ఎంతమందిపై కేసులు పెడతారో,అక్రమ కేసులతో ఎంతమంది గొంతు నొక్కుతారో చూద్దామని అన్నారు.
జానయ్య మహా నాయకుడు కావడం ఎవరూ ఆపలేరని, రానున్న రోజుల్లో బహుజన విప్లవం రాబోతుందని తెలిపారు.ఎస్సీ,ఎస్టీ,బీసీలు 99 శాతం ఉన్న తెలంగాణలో కేవలం ఒక శాతం ఉన్న రెడ్లు మాత్రమే పరిపాలిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
మంత్రి ఇచ్చే ఆత్మీయ సమ్మేళనాలకు, దావతులకు ఎస్సీ,ఎస్టీ, బీసీలు దూరంగా ఉండాలని సూచించారు.తొమ్మిదిన్నర సంవత్సరాలు మంత్రి వెనుక ఉంటే కేసులు లేవని,ఈరోజు బహుజన వాదం తెచ్చినందుకే కేసులు ఎలా వచ్చాయని అన్నారు.
అంతేకాదు కొంతమంది మీడియా వాళ్ళు చిలుక ప్రవీణ్, శంకర్ లాంటివాళ్ళు జానయ్యకు అమ్ముడుపోయారని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని,నేను ఒక జానయ్యకే కాదు 90% మంది బహుజన ప్రజలకు అమ్ముడుపోయానని తేల్చిచెప్పారు.చిలుక ప్రవీణ్,శంకర్ గురించి రాష్ట్రంలో అందరికి తెలుసునని ఎద్దేవా చేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుండెల ధర్మేంద్ర, రాష్ట్ర కోశాధికారి వెంకటేష్ చౌహన్,దయాకర్ మోరియా,సాంబశివ గౌడ్,రాష్ట్ర కార్యదర్శి అభయేందర్,రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు నర్ర నిర్మల,కవిత,నాగమణి, ప్రియదర్శిని,శోభ, తిరుపతయ్య,శంకరాచారి, పిల్లుట్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.