సూర్యాపేట జిల్లా: అందరికీ ఆరోగ్యం గురించి చెప్పి అనారోగ్యం బారిన పడిన వారికి ఆరోగ్య సూత్రాలు చెప్పేవారే కళ్ళ ముందే ఉన్న అపరిశుభ్రతపై నిర్లక్ష్యం చేయడంపై స్థానికంగా విమర్శలు వస్తున్నాయి.సూర్యాపేట జిల్లా నూతనకల్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పారిశుద్ధ్యం పడకేసినా పట్టించుకునే నాథుడే లేడని ఆసుపత్రికి వచ్చిన రోగులు వాపోతున్నారు.
ప్రజలు వివిధ రకాల అనారోగ్య సమస్యలతో ఆసుపత్రికి వస్తే,ఇక్కడ పేరుకుపోయిన అపరిశుభ్రతతో కొత్త రోగాలు వచ్చే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆరోగ్య కేంద్రం మెయిన్ గేట్ ముందున్న మురికి కాలువ నిండా నీరు నిలిచి లార్వాగా ఏర్పడి దోమలకు నిలయంగా మారిందని,ఆసుపత్రికి వచ్చే వారికే కాకుండా చుట్టూ ఉన్న జనాలకు కూడా ఇబ్బందిగా ఉందని అంటున్నారు.
గ్రామాల్లో పరిశుభ్రత గురించి ప్రజలకు చెప్పాల్సిన ఆరోగ్య సిబ్బంది తమ ఆసుపత్రి ముందే కనిపించే దానిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు.ఇప్పటికైనా వైద్యాధికారులు స్పందించి కాలువలో నీరు లేకుండా చేయించి,పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.