సూర్యాపేట జిల్లా:జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్( Agricultural market ) ఎదుట మంగళవారం రైతులు ధర్నా నిర్వహించి,సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు.అనంతరం రైతులు మాట్లాడుతూ సన్నవడ్లతో పాటు దొడ్డు వడ్లకు కూడా బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి( Chief Minister Revanth Reddy ) రైతులను నట్టేట ముంచుతుండని, మ్యానిఫెస్టోలో అన్ని రకాల ధాన్యానికి బోనస్ ఇస్తామని చెప్పి నేడు సన్నధాన్యానికే అంటూ రైతులను మోసం చేయడం ఏమిటని ప్రశ్నించారు.సన్నరకం ధాన్యం మార్కెట్ కు రాదని,అది ఎక్కువగా మిల్లుల్లోనే అమ్ముడు పోతుందని,నేల స్వభావాన్ని బట్టి నల్లరేగడి నేలల్లో ఎక్కువ శాతం రైతులు దొడ్డు వడ్లను పండిస్తుంటారని,దొడ్డు వడ్లకు బోనస్ ఇవ్వమనడం సరికాదన్నారు.
కేసీఆర్ రైతులను నెత్తిన పెట్టుకొని చూసుకుండని,కరెంట్ ఇచ్చిండని,కాళేశ్వరం నీళ్లు ఇచ్చిండని గుర్తు చేశారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాళేశ్వరం నీళ్లు ఇవ్వలేదని,కరెంటు సరిగా ఇవ్వడం లేదని, రైతుబంధు కూడా పంట చివర్లో ఇస్తున్నాడని,మా పంటలు ఎండిపోయాయని,పండిన కొద్ది పంట అమ్ముకునేందుకు అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కరెంటు కోతలు లేకుండా చూడాలని,కాళేశ్వరం నీళ్లు ఇవ్వాలని,పంటమొదట్లోనే రైతుబంధు ఇచ్చి రైతు రుణమాఫీని వెంటనే అమలు చేయాలని,అన్ని రకాల ధాన్యానికి బోనస్ ఇవ్వాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు.