సూర్యాపేట జిల్లా:హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలోని నేరేడుచర్ల మున్సిపాలిటీలో అధికార టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధుల మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరుకుందా? అంటే అవుననే అంటున్నాయి పట్టణంలో జరుగుతున్న వరుస ఘటనలు.మున్సిపల్ చైర్మన్ ఉండగా అధికారిక కార్యక్రమాలకు పిలవకుండా వైస్ చైర్మన్ అన్నీ తానై నడిపించడం ప్రస్తుతం పట్టణంలో చర్చనీయాంశంగా మారింది.
నేరేడుచర్ల అధికార పార్టీలో ఏం జరుగుతోంది? అనే ప్రశ్న అందరిలో ఉత్కంఠ రేపుతోంది.అధికార పార్టీ నేతలు గ్రూపులుగా విడిపోయి ఎవరికివారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారనేది బహిరంగ రహస్యమేనని పుర జనులు మాట్లాడుకుంటున్నారు.
ముఖ్యంగా పట్టణ టిఆర్ఎస్ పార్టీ నాయకత్వం రెండుగా చిలిపోయిందని,ఒకవైపు కొత్త నాయకులు మరోవైపు పాత నాయకులు అన్నట్టుగా తయారైందని పార్టీ కార్యక్రమాలు చూస్తే ఇట్టే అర్ధమవుతుంది.ఇదిలా ఉంటే ఇక మున్సిపాలిటీలో జరిగే వ్యవహారాలు మరింత విస్తుగొలిపే విధంగా ఉన్నాయి.
మున్సిపల్ చైర్మన్ పట్టించుకోకుండా వైస్ చైర్మన్ ఆధిపత్యం కొనసాగిస్తుందని చైర్మన్ సన్నిహితుల దగ్గర బాధపడుతూ అలక పూనినట్లు సమాచారం.రెండు రోజుల క్రితం అభివృద్ధి పనుల్లో భాగంగా సిసి రోడ్డు నిర్మాణం ఓపెనింగ్ విషయంలో మున్సిపల్ చైర్మన్ లేకుండానే వైస్ చైర్మన్ తన అనుచరగణంతో ప్రారంభోత్సవం జరపడంతో అంతర్గత వర్గపోరు తారాస్థాయికి చేరుకుందని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
మున్సిపల్ చైర్మన్ ని పట్టించుకోకుండా తన ఆధిపత్యాన్ని కొనసాగించే ప్రయత్నంలో వైస్ చైర్మన్ ఉన్నట్లుగా భావిస్తున్నారు.అందులో భాగంగానే అన్ని విషయాలలో ఇలానే చేస్తున్నట్లు చైర్మన్ పలువురి వద్ద వాపోతున్నట్లు తెలుస్తోంది.
పార్టీలో జరుగుతున్న పరిణామాలపై సొంత పార్టీ వారు బహిరంగంగా మాట్లాడకున్నా, చైర్మన్ కి ప్రాధాన్యత ఇవ్వకపోవడంపై ప్రతిపక్ష నాయకులు ప్రశ్నించడం కొసమెరుపు.అధికార పార్టీలో జరుగుతున్న ఈ ఆధిపత్య పోరు చిలికి చిలికి గాలి వానగా మారే అవకాశాలు ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇంతా జరుగుతున్నా గులాబీ నాయకత్వం గుస్స చేయకపోవడంపై పింకీ తమ్ముళ్లు ఒకింత అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం.