సూర్యాపేట జిల్లా:తెలంగాణ పల్లెల్లో ఊరికి ఒక ఆంబోతు ఉండడం సహజం.ఆ ఆంబోతును పల్లె జనం దైవ సమానంగా చూసుకోవడం ఆనవాయితీగా వస్తోంది.
అంతటి ప్రాముఖ్యతను సంతరించుకున్న వేర్వేరు గ్రామాల ఆంబోతులు ఒకే గ్రామంలో తారసపడితే పరస్పరం కాలు దువ్వడం సర్వసాధారణం.అలాంటి ఘటనే సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలోని చింతలపాలెం మండలం ఎర్రకుంట తండాలో చోటుచేసుకుంది.
వేరే గ్రామానికి చెందిన ఆంబోతు ఎర్రకుంట తండాకు రావడంతో గ్రామానికి చెందిన ఆంబోతు దానితో తలపడింది.రెండు దిట్టమైన ఆంబోతుల మధ్య జరిగిన సమరం చివరికి విషాదంగా ముగిసింది.
గ్రామస్తులు రెండు ఆంబోతుల మధ్య జరిగే పోరును ఆపడానికి ఎంత ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదు.గ్రామంలో రెండు ఆంబోతుల మధ్య జరిగిన హోరాహోరీ పోరులో బయటి నుండి వచ్చిన ఆంబోతు ప్రాణాలు కోల్పోయిందని గ్రామ సర్పంచ్ బుజ్జి హుస్సేన్ తెలిపారు.
మృతి చెందిన ఆంబోతు పాత నెమలిపురికి చెందినదిగా తెలుస్తోంది.ఆ ఊరు ముంపులో మునిగిపోయాక ఈ ఆంబోతు నార్లబోడు మీదా ఉండేదని సమాచారం.
ఈ సమాచారం తెలుసుకున్న వారు ఆంబోతును గుర్తించి వచ్చి తీసుకెళ్లగలరని సర్పంచ్ కోరుతున్నారు.