రైస్ మిల్లులపై క్రిమినల్ కేసులు నమోదు

సూర్యాపేట జిల్లా:జిల్లాలో ప్రతీ వ్యవసాయ సీజన్ లో ధాన్యం కొనుగోళ్లు,మిల్లర్లకు తరలించడంతో తరచూ అక్రమాలు జరుగుతున్నాయని అన్నదాతలు,ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నారు.గతంలో అనేక ఐకెపి,పీఏసీఎస్ కొనుగోలు కేంద్రాల్లో భారీ మొత్తంలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వెల్లువెత్తాయి.

 Registration Of Criminal Cases Against Rice Mills-TeluguStop.com

దీనికి తోడు ప్రభుత్వానికి మిల్లర్లు అందివ్వాల్సిన సిఎంఆర్ రైస్ కూడా సక్రమంగా అందివ్వకుండా తాత్సారం చేస్తూ ఆ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్నారని మిల్లర్లపై టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు చేసి,బియ్యం అక్రమాలకు పాల్పడిన మిల్లర్లకు నోటీసులు జారీ చేశారు.అయినా వారిలో మార్పు రాకపోవడంతో సంబధిత మిల్లులకు ఈ సీజన్ లో ధాన్యం సరఫరా అలాట్మెంట్ నిలిపివేశారు.

గురువారం జిల్లా సివిల్ సప్లై అధికారులు కోదాడ,నేరెడుచర్లలో బియ్యం బకాయి ఉన్న మిల్లుల్లో తనిఖీలకు వెళ్లగా యాజమాన్యం తాళాలు వేసుకొని ఉడాయించడంతో ఆ రెండు మిల్లులపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు.జిల్లాలో చాలా రైస్ మిల్లుల్లో సీఎంఆర్‌ కింద ఇవ్వాల్సిన కోటాకు,అందుబాటులో ఉన్న బియ్యం నిల్వలకు చాలా తేడా ఉన్నట్లు ఎఫ్‌సీఐ తనిఖీల్లో తేలింది.

ఎఫ్‌సీఐకి సీఎంఆర్‌ కింద పంపాల్సిన బియ్యానికి సంబంధించిన వానాకాలం ధాన్యం నిల్వలు చాలా మిల్లుల్లో లేనట్లు ఎఫ్‌సీఐ తనిఖీల్లో బయటపడింది.దీంతో మిల్లుల వారీగా సీఎంఆర్‌ కోసం ఆ మిల్లు ఎంత ధాన్యం తీసుకుంది? ఆ ధాన్యాన్ని మిల్లింగ్‌ చేయడం ద్వారా ఎంత బియ్యం వచ్చాయి? అందులో ఎఫ్‌సీఐకి ఎంత పంపించాయి? ఇంకా ఎంత బియ్యం పంపించాల్సి ఉంది? వాటికి సంబంధించి మిల్లుల్లో నిల్వ ఉన్న ధాన్యం వివరాలు సరిపోతున్నాయా? లేదా? ఈ విషయాలపై ఎఫ్‌సీఐ అధికారులు తనిఖీల్లో ప్రధానంగా దృష్టి సారించి,కొన్ని రైస్ మిల్లులు వానాకాలం ధాన్యాన్ని అధిక ధరకు అమ్ముకున్నట్లుగా తేల్చారు.తాజాగా యాసంగిలో కొనుగోలు చేసిన ధాన్యాన్నే ఖరీఫ్‌(వానాకాలం) ధాన్యంగా లెక్కలు చూపిస్తున్నారని ఎఫ్‌సీఐ అధికారులు చెబుతున్నారు.దీనితో జిల్లా వ్యాప్తగా 72 రైస్ మిల్లు ఉండగా 34 రైస్ మిల్లులకే ధాన్యం అలాట్మెంట్ ఇచ్చారు.

గత మూడు సంవత్సరాలకు సంబంధించి సిఎంఆర్ రైస్ ను కొందరు మిల్లర్లు పెండింగ్ లో ఉంచుతూ వస్తున్నారు.దీనిపై గతంలోనే జిల్లా కలెక్టర్ స్థాయిలో అందరికీ వీలైనంత త్వరగా పెండింగ్ రైస్ క్లియర్ చేయాలని నోటీసులు ఇచ్చారు.

ఇప్పటికే ఆ గడువు పూర్తి కావడంతో మళ్ళీ గడువు పొడిగించారు.అయినా రేపు, మాపు అంటూ కాలం వెళ్లదీస్తూ మిల్లర్లు పక్కాగా ప్రభుత్వానికి పంగనామాలు పెట్టేందుకు పథకం సిద్దం చేసుకున్నారు.

అయితే దీనంతటికీ కారణం రైస్ మిల్లర్లకు ఎలాంటి బ్యాంకు గ్యారెంటీ లేకుండా ప్రభుత్వం ఐకెపి సెంటర్ల ద్వారా కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లర్లకు ఇవ్వడమేనని తెలుస్తోంది.దీన్నే అలుసుగా తీసుకున్న మిల్లర్లు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని అర్థమవుతుంది.

ఏదైనా కొంత బ్యాంక్ గ్యారంటీ ఉంటే మిల్లర్లు తాము తీసుకున్న ధాన్యాన్ని పక్కదారి పట్టకుండా జాగ్రత్త పడేవారని,అయితే ఇక్కడ కొన్ని మిల్లర్లకు సంబంధించిన యజమానులు వాళ్ల అవసరాలు నిమిత్తం ప్రభుత్వం పంపించిన ధాన్యాన్ని అమ్ముకోవడం మొదలుపెట్టారని సమాచారం.దీనితో పరిస్థితి చేయి దాటిపోయే ప్రమాదం ఉందని భావించిన జిల్లా సివిల్ సప్లై అధికారులు సంబధిత మిల్లులపై కొరడా ఝులిపిస్తున్నారు.

ఎవరైతే 100% బియ్యం ప్రభుత్వానికి ఇవ్వలేదో వారికి ఈ సీజన్లో అలాట్మెంట్ నిలిపివేశారు.అంతేకాకుండా 2020- 2021 సీజన్లో కోదాడ పట్టణంలోని ఉషస్విని రైస్ మిల్లు, నేరేడుచర్లకు చెందిన లక్ష్మీసహస్ర మిల్లు సుమారు రూ.65 కోట్ల ధాన్యానికి సంబంధించిన రైస్ ఇప్పటివరకు పెట్టకుండా ఉండటంతో ఆ రెండు మిల్లులపై సివిల్ సప్లై అధికారులు కేసు నమోదు చేశారు.2020 యాసంగి సీజన్లో సూర్యాపేట జిల్లాలో 72 మిల్లులకు గాను 6,68,75 మెట్రిక్ టన్నుల వడ్లను కేటాయించడం జరిగింది.అందుకుగాను 4,52,695 మెట్రిక్ టన్నుల రైసు ఇవ్వవలసి ఉండగా 4,33,815 మెట్రిక్ టన్నుల రైస్ ఇవ్వడం జరిగింది.ఇంకా 18,880 మెట్రిక్ టనుల బియ్యం ప్రభుత్వానికి బకాయి రావాల్సి ఉంది.2021-22 వానకాలంలో జిల్లాలోని 72 మిల్లులకు 3,64,44 మెట్రిక్ టన్నుల వడ్లు కేటాయించారు.అయితే 2.44 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఇవాల్సి ఉండగా నేటికీ 1,50,742 మెట్రిక్ టన్నులు మాత్రమే ఇచ్చారు.వీటన్నింటిని గమనించిన సూర్యాపేట జిల్లా సివిల్ సప్లై అధికారులు ఈ దపా 100% రైస్ అందించిన 38 మిల్లులకు మాత్రమే ధాన్యం పెట్టడం జరిగింది.

రెండు మిల్లులపై కేసులు నమోదు.ప్రభుత్వానికి ఇవ్వాల్సిన 35 కోట్ల రూపాయల విలువగల సిఎంఆర్ బియ్యాన్ని ఎగ్గొట్టడంతో జిల్లా సివిల్ సప్లై అధికారులు తనిఖీకి వెళ్ళగా కోదాడ మండలం కాపుగల్లు గ్రామంలోని ఉషస్విని రైస్ ఇండస్ట్రిస్ యాజమాన్యం మిల్లుకి తాళాలు వేసి ఊడాయించారు.

అదే విధంగా నేరేడుచర్లకు చెందిన లక్ష్మీసహస్ర మిల్లు యాజమాన్యం కూడా అదే పరిస్థితిలో ఉండడంతో ఆ రెండు మిల్లులపై కేసులు నమోదు చేసినట్లు జిల్లా సివిల్ సప్లై అధికారి పుల్లయ్య తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube