సూర్యాపేట జిల్లా:తెలుగు రాష్ట్రాల్లో మత సామరస్యానికి పేరుగాంచిన సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలంలోని జాన్ పహాడ్ ( John Pahad )దర్గా ఉర్సు ఉత్సవాలు ప్రతి జనవరి నెలలో మూడు రోజుల పాటు అత్యంత వైభవంగా జరుగుతాయి.ఈ ఉర్సు ఉత్సవాలకు పది రోజులు ముందుగానే వివిధ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమావేశం ఏర్పాటు చేసి వచ్చే భక్తులకు కావలసిన సదుపాయాలపై సమీక్షిస్తారు.
ఈ నేపథ్యంలో ఈ ఏడాది జనవరి 25,26,27 తేదీల్లో వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో జరిగే ఉర్సుకు ప్రణాళికలు సిద్ధం చేసేందుకు ప్రభుత్వ అధికారులు గత మంగళవారం సమీక్ష నిర్వహించారు.ఈసారి ఉత్సవాలకు రెండు లక్షల పైచిలుకు భక్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేసి,అన్ని ప్రభుత్వ శాఖల అధికారుల సమన్వయంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
ఇంతవరకు బాగానే ఉంది.కానీ,ప్రతీ యేటా జాన్ పహాడ్ దర్గా ఉర్సు ఉత్సవాల సందర్భంగానే కాకుండా ఏడాది పొడవునా వివిధ జిల్లాల నుండి ఇక్కడికి భక్తులు వందల సంఖ్యలో వస్తుంటారు.
దీనితో దర్గాకు ప్రతీ యేటా కోట్లలో ఆదాయం వస్తుందని, అయినా దర్గా అభివృద్ధికి మాత్రం నోచుకోవడం లేదనే విమర్శలు దండిగా వినిపిస్తున్నాయి.ఉభయ తెలుగు రాష్ట్రాలలో ప్రసిద్ధిగాంచిన జాన్ పహాడ్ దర్గాకు ఇప్పటి వరకు పర్మినెంట్ సదుపాయాలు లేకపోవడంపై భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ప్రతీసారీ ఉత్సవాల సందర్భంగా అరకొర తాత్కాలిక సదుపాయాలు ఏర్పాటు చేయడం చేతులు దులుపుకోవడం తప్పా శాశ్వత పరిష్కారం చూపకపోవడంతో ఉర్సు ముగిసిన అనంతరం యధా మామూలుగా మారిపోవడం పరిపాటిగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.జాన్ పహాడ్ దర్గా స్టేట్ వక్ఫ్ బోర్డ్ ఆధీనంలో ఉంటుందని, ప్రతి ఏటా 2 కోట్ల ఆదాయం వస్తున్నా దర్గా అభివృద్ధికి కేటాయించరని ప్రతిసారి సమీక్షా సమావేశాల్లో స్థానిక నేతలు,భక్తులు వక్ఫ్ బోర్డు మరియు జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లినా దర్గా పరిసర ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలు నేటికీ పరిష్కారం కాకపోవడంపై మండిపడుతున్నారు.
దర్గాకి వచ్చే ఆదాయంలో కొంత మేరకు ఖర్చు చేసినా శాశ్వత నిర్మాణాలు చేపట్టవచ్చని,ఈ విషయంలో వక్ఫ్ బోర్డు, జిల్లా అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైందని, ఆదాయం ఉన్నా సౌకర్యాలు మాత్రం సున్నా అని ఆరోపిస్తున్నారు.జాన్ పహాడ్ దర్గా పరిసర ప్రాంతాల్లో మహిళా భక్తులకు పర్మినెంట్ స్నానపు గదులు, టాయిలెట్స్ లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, తాత్కాలికంగా ఏర్పాటు చేసి,స్థానిక సిమెంట్ ఫ్యాక్టరీల సౌజన్యంతో ట్యాంకర్లలో నీటిని అందిస్తారని,అవి కూడా అందరికీ అందే పరిస్థితి ఉండదని వాపోతున్నారు.
శిధిలమైన సత్రాలు కాంట్రాక్టర్ల ఇస్తారాజ్యం, భక్తుల నుండి అక్రమ వసూళ్లు,ఇలా అనేక సమస్యలు గత కొన్నేళ్లుగా పట్టిపీడిస్తున్నాయని, సమీక్షలో అధికారులకు సూచనలు ఇవ్వడం తప్ప పర్మినెంట్ సదుపాయాలపై దృష్టి పెట్టకపోవడంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైందని అంటున్నారు.ఈ సారి ఉర్స్ ఉత్సవాలకు 13 లక్షలు కేటాయించారని వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్ మహమ్మద్ తెలిపారు.
మరుగుదొడ్లు స్నానపు గదులు,సత్రాలు,నీటి సౌకర్యం,పారిశుద్ధ్యం, విద్యుత్,తక్షణ అవసరాల కొరకు వక్ఫ్ బోర్డ్ సీఈఓకి ప్రతిపాదనలు పంపామని అన్నారు
.