సూర్యాపేట జిల్లా:శ్రీ చైతన్య స్కూల్ యాజమాన్యం నిర్వాకం.పదవ తరగతి పరీక్షల్లో తెలుగుకు బదులు సంస్కృత పేపర్.
పేపర్ చూసి అవాక్కైన విద్యార్థులు.అధికారుల జోక్యంతో అర్ధగంట ఆలస్యంగా పరీక్ష.
పదో తరగతి పరీక్షల మొదటి రోజే పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా విద్యార్థులు గందరగోళానికి గురయ్యారు.మండల విద్యా శాఖ అధికారి జోక్యంతో అర్ధగంట ఆలస్యంగా టెన్షన్ టెన్షన్ గా పరీక్ష రాసిన ఘటన కోదాడలోని శ్రీ చైతన్య పాఠశాలలో వెలుగుచూసింది.
వివరాల్లోకి వెళితే రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం పదవ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి.కోదాడ శ్రీ చైతన్య పాఠశాలలో పరీక్షకు హాజరైన విద్యార్థులకు తెలుగు పేపర్ బదులు సంస్కృతం పేపర్ ఇవ్వడంతో విద్యార్థులు ఏమి చేయాలో అర్థంకాక టెన్షన్ పడ్డారు.
శ్రీ చైతన్య పాఠశాలలో పరీక్షా కేంద్రానికి హాజరైన విద్యార్థులకు ఆప్షన్ ఇవ్వడంలో యాజమాన్యం నిర్లక్ష్యంగా వహించడంతో తెలుగు పేపర్ రాయాల్సిన 26 మంది విద్యార్థులకు సంస్కృతం పేపర్ వచ్చింది.స్కూల్ యాజమాన్యం చేసిన తప్పిదానికి విద్యార్థులు తీవ్ర మానసిక ఆందోళనకు గురయ్యారు.
దీనిపై ఎంఈఓ సలీం షరీఫ్ ను సంప్రదించగా ఆయన వెంటనే స్పందించి విద్యార్థులతో డిక్లరేషన్ తీసుకొని మరల వారికి కావాల్సిన తెలుగు పేపర్ ఇచ్చి పరీక్ష సజావుగా సాగేందుకు చర్యలు తీసుకోవడంతో అర్ధగంట ఆలస్యంగా 26 మంది విద్యార్థులు పరీక్ష రాశారు.విద్యార్థుల భవిష్యత్ ను ఫణంగా పెట్టి, నిర్లక్ష్యంగా వ్యవహరించిన పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని పేరెంట్స్ డిమాండ్ చేస్తుండగా, విద్యార్థులకు ఎటువంటి అన్యాయం జరగకుండా చేశామని ఎంఈఓ సలీమ్ షరీఫ్ చెప్పారు.