సూర్యాపేట జిల్లా: బీఆర్ఎస్ పార్టీలో నిజమైన ఉద్యమ కారులకు చోటులేదని,ఆ పార్టీ ఉద్యమ ద్రోహులతో నిండిపోయిందని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి( Patel Ramesh Reddy ) అన్నారు.శనివారం జిల్లా కేంద్రంలో గత నాలుగు రోజుల క్రితం బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన సుమారు 50 మంది నాయకులను కలిసి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే,మంత్రి జగదీష్ రెడ్డి నిజమైన ఉద్యమకారులకు ప్రాధాన్యత ఇవ్వకుండా ల్యాండ్,సాండ్,మైన్స్, వైన్స్ మాఫియాలకు అండగా నిలుస్తున్నారని అన్నారు.తెలంగాణ సెంటిమెంట్ తో సూర్యాపేట నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి,మంత్రిగా వేలకోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించాడని ఆరోపించారు.
వందలామందివిద్యార్థుల బలిదానాలకు చెలించి సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రసాదించిందని,కానీ,కేసీఆర్ దాన్ని తమ స్వార్థం కోసం ఆగం చేశారని మండిపడ్డారు.నిజమైన ఉద్యమకారులకు గుర్తింపు ఇస్తామని ఇటీవల హైదరాబాద్ లో యూత్ డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసిందని,అందుకే ప్రజలు కాంగ్రెస్ వెంట ఉన్నారన్నారు.
సూర్యాపేట ప్రాంతంలో జలహారతులు పడుతూ, సాగునీరు తామే తెచ్చామని జగదీష్ రెడ్డి ఫోజులు కొడుతున్నాడని,నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మించింది కాంగ్రెస్( Congress ),మూసి ప్రాజెక్టు నిర్మించింది కాంగ్రెస్,రాజశేఖర్ రెడ్డి హయాంలో జలయజ్ఞం కార్యక్రమంలో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ద్వారా సూర్యాపేట ప్రాంతంలో లక్షల ఎకరాలకు సాగునీరు అందించింది కాంగ్రెస్ అని గుర్తు చేశారు.బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి చేరిన నాయకులకు సముచిత గౌరవం,ప్రాధాన్యత ఇస్తామని పిసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారని,పాత మిత్రులైన నాయకులకు సాదర స్వాగతం పలుకుతున్నామని అన్నారు.
రానున్న అసెంబ్లీ ఎన్నికలలో 50,000 ఓట్లకు తగ్గకుండా తేడాతో ఓడించి మంత్రిని నాగారం పంపించడం ఖాయమని అన్నారు.ఈ కార్యక్రమంలో పెద్దిరెడ్డి రాజా,మోదుగు నాగిరెడ్డి,శనగాని రాంబాబు గౌడ్,భాస్కర్, నేరెళ్ల మధు,సాహిద్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.