సూర్యాపేట జిల్లా:మోతె మండలం బుర్కచర్ల గ్రామంలోని సర్వే నంబర్ 229 లో గల 20 గుంటల ఖబరస్తాన్ (ముస్లింల స్మశాన వాటిక) స్థలాన్ని మరియు సర్వే నంబర్ 228 గల 6 గంటల వక్ఫ్ బోర్డ్ స్థలాన్ని కాపాడాలంటూ ఆవాజ్ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డిని కలసి వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2012 లో కొంతమంది ఈ భూములను ఆక్రమించుకోవాలని ప్రయత్నం చేయగా అప్పటి జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా స్పందించిన కలెక్టర్ ఆ భూమిలో ఎటువంటి నిర్మాణాలు చేయవద్దని హెచ్చరించడంతో వారి ప్రయత్నాన్ని విరమించుకున్నారని తెలిపారు.గ్రామంలోని ముస్లింల ఆర్ధిక స్థితిగతులు మెరుగ్గా లేకపోవడం వల్ల పట్టణాలకు వలస వెళ్లడం జరిగిందని అన్నారు.
అక్కడ కొంతమంది దాతల నుండి చందాల రూపంలో కొంత నగదును సేకరించి, స్థల బౌండరీ నిర్మాణం కొరకు గ్రామానికి వెళ్లగా మళ్ళీ పరిస్థితి మొదటికిచ్చిందని వాపోయారు.కొంతమంది అవినీతి అధికారులతో సర్వే నంబర్లను బై నెంబర్లుగా మార్చి,ఆ భూమిలో అక్రమ నిర్మాణాలు చేపట్టడానికి పూనుకోగా,గ్రామంలోని ముస్లింలు దీనిని అడ్డుకోవడం జరిగిందన్నారు.
ముస్లింల ఖబరాస్తాన్ స్థలం మరియు వక్ఫ్ బోర్డు స్థలంలో అక్రమ నిర్మాణాలను జరగకుండా చూడగలరని కలెక్టర్ ను వేడుకున్నారు.ఇట్టి భూమిని పాత నక్ష ప్రకారం హద్దులు కేటాయించి,ఫినిషింగ్ వేయించగలరని కోరారు.
ఈ కార్యక్రమంలో ఆవాజ్ జిల్లా కార్యదర్శి షేక్ జహంగీర్,జిల్లా అధ్యక్షులు ముక్తార్ అహ్మద్ సోహెల్,యాకూబ్ పాషా,సలీం తదితరులు పాల్గొన్నారు.