సూర్యాపేట జిల్లా: జిల్లా కేంద్రంలో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి నిర్వహిస్తున్న గడప గడపకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం గురువారం 8వ రోజు 30వ వార్డు శ్రీశ్రీ నగర్ లో కొనసాగింది.ఈ సందర్భంగా నామ ప్రవీణ్ ఆధ్వర్యంలో 30వ వార్డుకు చెందిన బీఆర్ఎస్ పార్టీ మాజీ టౌన్ అధ్యక్షులు పుప్పాల వేణు నాయుడు, ఆనంద్ పార్టీ రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు.
వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో సమయానికి నీటి సరఫరా కూడా జరగక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.
మంత్రి జగదీష్ రెడ్డి ప్రెస్ మీట్ లు పెట్టి కాంగ్రెస్ పైన విమర్శలు చేస్తున్నాడని మొదటగా విమర్శలు మానుకొని జిల్లా అభివృద్ధిపై దృష్టి పెట్టాలన్నారు.సూర్యాపేట నియోజకవర్గంలో తనకు ఓటమి తప్పదని గ్రహించి వివిధ పార్టీలకు చెందిన నాయకులను కార్యకర్తలను పార్టీలోకి రావాలంటూ మభ్యపెడుతున్నాడని, అయినప్పటికీ ఏ ఒక్క వ్యక్తి మంత్రిని నమ్మే పరిస్థితిలో లేరన్నారు.
బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని,త్వరలో దేశంలో,రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయన్నారు.కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు 500 రూపాయలకు వంటగ్యాస్, పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు అందజేస్తామని తెలిపారు.
రేవంత్ రెడ్డిని ఎదుర్కొనే దమ్ము లేక బీఆర్ఎస్ నాయకులు చిల్లర విమర్శలు చేస్తున్నారని, త్వరలోనే బీఆర్ఎస్ కారు ఖాళీ అవడం ఖాయమని అన్నారు.ప్రజలకు పొర్లుదండాలు పెట్టినా, నూట ఒక్క ప్రదక్షిణలు చేసినా బీఆర్ఎస్ పార్టీని ప్రజలు బంగాళాఖాతంలో కలపడం తప్పదన్నారు.
తెలంగాణ గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్ పార్టీ నాయకులకు లేదని, ఓటమి భయంతోనే బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ పై విమర్శలు చేస్తున్నారని అన్నారు.బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని, రేవంత్ రెడ్డిని విమర్శించే ముందు సీఎం కేసీఆర్ ఏ పార్టీ నుంచి వచ్చాడో తెలుసుకోవాలని హితవు పలికారు.
నాడు రేవంత్ రెడ్డి సామాన్య కార్యకర్త నుండి నేడు టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎదిగాడని తెలిపారు.