మద్దిరాల మండలం రామచంద్రాపురం గ్రామంలోని మొర్సకుంట చెరువు వద్దకు రైతులు పంట పొలాలకు వెళ్లడానికి దారి లేకుండా చేశారని ఆరోపిస్తూ శనివారం టిపిసిసి (TPCC)రాష్ట్ర అధికార ప్రతినిధి అన్నెపర్తి జ్ఞానసుందర్ (Anneparthi Gnanasunder)అధ్వర్యంలో గ్రామస్తుల చెరువు వద్ద ఆందోళన చేపట్టారు.ఈ సందర్భంగా జ్ఞానసుందర్ మీడియాతో మాట్లాడుతూ బతుకమ్మ పండుగ సమయంలో గ్రామ ఆడపడుచులు బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించి చెరువులో వేయడానికి వెళ్ళే దారి లేకుండా చేశారని,పరిసర ప్రాంతాల రైతులు తమ జీవనాధారమైన ఈ చెరువుపై ఆధారపడి సాగు చేసుకుంటారని,వారు పొలాల వద్దకు వెళ్లే తొవ్వ కూడా లేక పండిన పంటలను నివాస గృహాలకు తరలించడానికి వీలులేక,రైతులు,కూలీలు పొలం గట్ల మీద నుండి తమ భుజాలపై మోసుకుంటూ వెళ్తూ నానా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
రైతులు, కూలీలు ధాన్యం బస్తాల బరువులతో వెళ్తూ పొలం గట్టు మీద నుండి కిందపడి గాయాల పాలవుతున్నారని, బతుకమ్మలు తీసుకుని పొలం గట్టు మీద నడుస్తూ మహిళలు కిందపడిన సంఘటనలు కోకొల్లలుగా ఉన్నాయని తెలిపారు.
గతంలో ఎండ్ల బండ్లు మరియు ఎండ్ల నాగళ్ళ కొటేరులతో రైతులు రాకపోకలు నిర్వహించేవారని, ఇప్పుడు రహదారి మొత్తం కనుమరుగైందని వాపోయారు.
వెంటనే సంబంధిత అధికారులు చెరువు దారిపై విచారణ చేయించి,రైతులను,కూలీలను,మహిళలను,ప్రజలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.అదేవిధంగా గ్రామం నుండి మద్దిరాల మండల కేంద్రానికి వెళ్ళడానికి బిటి రోడ్డు గాని,సిమెంట్ గాని లేదని, హాస్పిటల్ కు వెళ్ళే బాలింతలు,పేషెంట్లు,కూలీ పనులకు వెళ్ళే పేదవారు, పాఠశాలకు వెళ్ళే విద్యార్థులకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు.
గత పది సంవత్సరాలుగా ఎన్నిసార్లు విన్నవించినా గత బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని,77 ఏళ్ల భారతదేశంలో గ్రామ ప్రజలు మండల కేంద్రానికి వెళ్ళడానికి సౌకర్యవంతమైన బిటి రోడ్డు,సిమెంట్ రోడ్డు లేకపోవడం విచారకరమన్నారు.ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ తీసుకుని ప్రజల సౌకర్యార్థం మొర్సకుంట చెరువుకు,మద్దిరాల మండల కేంద్రానికి వెళ్ళడానికి రోడ్ల నిర్మాణం వెంటనే చేపట్టాలని కోరారు.