సూర్యాపేట జిల్లా:తాను సాధారణమైన జీవితాన్ని గడుపుతూ తన పిల్లలను కూడా అలాగే ప్రోత్సహిస్తూ,ప్రజల సొమ్ముతో పబ్బం గడుపుతూ స్టేటస్ కోసం ఆరాటపడే అధికారిని కాదని ఇటీవల కోదాడ ఆర్డీవోగా బాధ్యతలు స్వీకరించిన సూర్యనారాయణ నిరూపించారు.తన ఇద్దరు పిల్లల్లో పెద్ద కుమారుడు షణ్ముఖ నాయుడును కెఆర్ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో చేర్పించి, చిన్న కుమారుడు మోషిత్ నాయుడును( Moshit Naidu ) కోదాడ బాలుర ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి తెలుగు మీడియంలో చేర్పించారు.
చిన్నప్పటి నుండి పేదరికంలో పుట్టి పెరిగిన ఆర్డీవో సూర్యనారాయణ ప్రభుత్వ పాఠశాల్లో చదివి ప్రభుత్వ ఉద్యోగం సాధించాడు.ప్రభుత్వ అటెండర్ కూడా తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలలో చదివిస్తున్న రోజుల్లో ఉన్నతాధికారిగా ఉన్నప్పటికీ తమ పిల్లలను ఇద్దరిని ప్రభుత్వ విద్యా సంస్థల్లో చేర్పించి అందరికీ ఆదర్శంగా నిలిచారు.
ఈ సందర్భంగా ఆర్డీవో సూర్యనారాయణ మాట్లడుతూ ప్రభుత్వ పాఠశాలలను బలపేతమే తన లక్ష్యమని,అందుకే తన పిల్లలను ప్రభుత్వ విద్యా సంస్థల్లో చేర్పించానని,ప్రభుత్వ విద్యా రంగానికి బలోపేతం చేసేందుకు ప్రతీ ఒక్కరూ ముందుకు రావాలని కోరారు.అప్పుడే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందన్నారు.
బాలుర ప్రభుత్వ పాఠశాలలో 200 అడ్మిషన్లు అయ్యాయని తెలిపారు.కోదాడ ఆర్డీవో ఇచ్చిన స్ఫూర్తిని మిగతా ఉద్యోగుల సైతం ఆదర్శంగా తీసుకోవాలని పలువురు సామాజిక వేత్తలు ఆర్డీవో ఉన్నత ఆశయాన్ని కొనియాడుతున్నారు.