సూర్యాపేట జిల్లా:పల్లెలో నివసించే ప్రజల రవాణా సౌకర్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం పల్లె వెలుగుల పేరుతో ప్రవేశపెట్టిన ఆర్టీసి బస్సులు( RTC bus ) పల్లెల్లో కనిపించడం లేదని, పట్టణాలకే పరిమితమై పల్లెల్లో రవాణా సౌకర్యం అస్తవ్యస్తంగా మారిందని పల్లె ప్రజలు,విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.అనంతగిరి మండలంలో గతంలో కోదాడ నుండి అనంతగిరి, పాలావరం గ్రామాల మీదగా చనుపల్లి వరకు, కోదాడ నుంచి శాంతినగర్ మీదగా మొగలాయికోట వరకు,కోదాడ నుంచి దొరకుంట చిమిర్యాల మీదగా గొండ్రియాల వరకు మూడు రూట్లలో పల్లె వెలుగు బస్సులు తిరిగేవి.
వాటిని కరోనా సమయంలో నిలిపివేసిన ఆర్టీసి అధికారులు కరోనా అనంతరం తిరిగి పునరుద్ధరించలేదు.
కోదాడ( Kodada) పట్టణాన్ని ఆనుకొని అనంతగిరి మండలం ఉండడంతో నిత్యం వందలాది మంది పట్టణానికి వెళ్తుండడంతో బస్సు సౌకర్యం లేక ఆటోలను ఆశ్రయించాల్సి రావడంతో ఆటో వాళ్ళుఅధిక ఛార్జీలు వసూలు చేస్తూ అందినకాడికి దండుకోవడంతో ప్రజలు, విద్యార్థులు ఆర్థికంగా నష్టపోతున్నామని వాపోతున్నారు.రోజుకి రూ.120 రవాణా ఛార్జీలు అవుతున్నాయని శివ కుమార్( Siva Kumar ) అనే విద్యార్థి అంటున్నారు.గతంలో బస్సు పాస్ సౌకర్యం ఉండడంతో తక్కువ ఛార్జీలు అయ్యేవని, ఇప్పుడు ఆటోలో ఎక్కుతుండడంతో ఒక్క రోజుకి రూ.120 చార్జీలు వసూలు చేస్తున్నారు.దీంతో ప్రతి నెల రూ.3000 పైగా రవాణా ఖర్చులు అవుతున్నాయి.చాలామంది విద్యార్థులు రవాణా చార్జీల పేరిట నష్టపోతున్నారు.కనీసం రోజులో ఉదయం సాయంత్రం వేళ్లలో అయినా బస్సు సౌకర్యం పునరుద్ధరించాలని కోరారు.కొన్ని గ్రామాల్లో పల్లె వెలుగు బస్సులు రాక ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్లు మా దృష్టికి వచ్చిందని కోదాడ ఆర్టీసీ డీఎం హర్ష తెలిపారు.నియోజకవర్గ వ్యాప్తంగా గతంలో తిరిగి ఇప్పుడు తిరగని రూట్లను పరిశీలిస్తామని,నిత్యం పట్టణాలకు వచ్చే ప్రజలు బస్సు పాస్ సౌకర్యం గల విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా బస్సులు నడిపించేందుకు కృషి చేస్తామని అన్నారు.