సూర్యాపేట జిల్లా:75 సంవత్సరాల స్వాతంత్ర్య దినోత్సవాల కార్యక్రమం”ఆజాదీ కా అమృతోత్సవం” ను పురస్కరించుకొని నూతనకల్ పట్టణంలోని శ్రీ సాయిరాం ఫంక్షన్ హాల్ నందు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వివిధ రకాల వ్యాధులపై ప్రత్యేక నిపుణుల సమక్షంలో వైద్య శిబిరాలను నిర్వహించారు.ఈ ఆరోగ్య మేళాను భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించి,ఆరోగ్య ప్రదర్శనకు సంబంధించిన వివిధ రకాల స్టాల్స్ ను పరిశీలించారు.
ఆరోగ్య కార్యక్రమాల వివరాలు అడిగి తెలుసుకున్నారు.స్వయంగా బిపి, షుగర్ పరీక్షలు చేయించుకున్నారు.
అనంతరం ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ జాతీయ మరియు రాష్ట్ర ఆరోగ్య కార్యక్రమాల స్టాళ్లను ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.ఆరోగ్య శాఖ వారు గత రెండు సంవత్సరాలుగా కరోనాపై అలుపెరగని పోరాటం చేస్తున్నారని,కుటుంబ సభ్యులే వెనకడుగు వేసినప్పటికీ,ఆరోగ్య శాఖ వారు అక్కున చేర్చుకొని కరోనా సోకినవారి కుటుంబాలను జాగ్రత్తగా చూసుకున్నారని,ఆరోగ్య శాఖలోని వైద్యులు వైద్య సిబ్బంది ఆరోగ్య కార్యకర్తలు ఆశ కార్యకర్తల సేవలు వెలకట్టలేనివి,వారికి చేతులు జోడించి నమస్కారం చేస్తున్నట్లు తెలియజేశారు.
ఇటువంటి ప్రత్యేక ఆరోగ్య మేళాను ఏర్పాటు చేసినందుకు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారిని ప్రత్యేకంగా అభినందించారు.కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ ఆరోగ్య పథకాలను ఏర్పాటు చేశాయని,వాటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
మానసిక ఆరోగ్య కార్యక్రమాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని,ధూమపానం మరియు మద్యపానంపై ప్రత్యేక అవగాహన శిబిరాలు ఏర్పాటు చేయాలని కోరారు.మద్యం మానాలి అంటే ముందు కుటుంబ సభ్యుల్లో మార్పు తీసుకురావాలని, ఆ తర్వాత మనం మారాలని అన్నారు.
కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి ఆరోగ్య మేళాను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు.అందుతున్న సేవలను శిబిరానికి వచ్చిన వారి వద్ద నుండి ఆరా తీశారు.డిజిటల్ హెల్త్ కార్డు ప్రతి ఒక్కరికి డౌన్లోడ్ చేసి ఇవ్వాలని తెలిపారు.అనంతరం జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కోట చలం మాట్లాడుతూ జీవనశైలి మరియు వాతావరణంలో మార్పుల వల్ల వివిధ రకాల వ్యాధులు వస్తున్నాయని అన్నారు.కరోనా కట్టడికి సిబ్బంది ప్రతి ఒక్కరికి టీకాలు వేశారని దాన్ని 100% పూర్తిచేయాలని అన్నారు.
వేసవికాలంలో వడదెబ్బపై అప్రమత్తంగా ఉండాలని అన్నారు.మలేరియా,డెంగ్యూ లాంటి వ్యాధులు సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.
క్షయ వ్యాధికి ప్రభుత్వం ఆధ్వర్యంలో సరఫరా మందులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కరుణశ్రీ ,స్థానిక ఎంపీపీ,డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ హర్షవర్ధన్,జిల్లా ప్రోగ్రాం అధికారులు డాక్టర్ వెంకటరమణ,డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి,డాక్టర్ చంద్రశేఖర్,డాక్టర్ సాహితీ,డాక్టర్ జయ,డాక్టర్ కిరణ్,వివిధ స్పెషలిస్ట్ వైద్యులు,డెమో అంజయ్య, భూతరాజు సైదులు,శ్రీనివాస్,యాదగిరి,మాధవరెడ్డి, కొండ శీను వివిధ మండలాలకు చెందిన ప్రతినిధులు, ఆరోగ్య కార్యకర్తలు,ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.