సూర్యాపేట జిల్లా:జిల్లా నూతన ఎస్పీగా సన్ ప్రీత్ సింగ్ బాధ్యతలు స్వీకరించారు.ముందుగా జిల్లాకు చెందిన అడ్మిన్ అదనపు ఎస్పి ఎం.
నాగేశ్వరరావు,ఆర్ముడ్ అదనపు ఎస్పి ఆర్.జనార్ధన్ రెడ్డి,డిఎస్పీలు రవి,శ్రీధర్ రెడ్డి, మట్టయ్య,శ్రీనివాసరావు. ఇన్స్పెక్టర్లు,ఎస్ఐలు,పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు ఆయనకు పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికి,గౌరవ వందనం సమర్పించారు.బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో శాంతిభద్రత రక్షణ, పౌరుల రక్షణకు జిల్లా పోలీసు శాఖ పటిష్టంగా పని చేస్తుందని తెలిపారు.
జిల్లాలో నేరాల తీరుతెన్నులు,సమస్యలపై ఎక్కువగా దృష్టి పెట్టి,వాటి నివారణకు కృషి చేస్తామన్నారు.జిల్లాలో నేరాల రకాలు,పాత నేరస్తుల కదలికలపై నిఘా ఉంచుతామని,పెట్రోలింగ్ పటిష్టంగా చేస్తామని,ప్రజలకు అందుబాటులో ఉంటూ స్నేహపూర్వక పోలీసింగ్ నిర్వహిస్తామన్నారు.
రోడ్డు ప్రమాదాల నివారణ,మహిళల రక్షణ,అక్రమ కార్యకలాపాల నివారణ,డ్రగ్స్ నిర్మూలనకు కృషి చేస్తామన్నారు.జాతీయ రహదారి ఎక్కువగా ఉన్నదని, ప్రమాదాలు జరగకుండా పని చేస్తామని అన్నారు.యువత నేరాలకు పాల్పడకుండా అవగాహన కల్పిస్తామన్నారు.ప్రజలకు పోలీసు సేవలు అందించడంలో పలు ఆదేశాలు ఇచ్చారు.
సిబ్బంది అందరూ ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండాలని, విజువల్ పోలీసింగ్ స్నేహపూర్వకంగా నిర్వహించాలన్నారు.ఫిర్యాదుదారులకు, బాధితులకు భరోసా కల్పించాలన్నారు.
రౌడీ,సస్పెక్ట్ షీట్స్ ఉన్న వారి కదలికలు క్షుణ్ణంగా తనిఖీలు చేయాలని, పెట్రోలింగ్ పకడ్బందీగా చేయాలని ఆదేశించారు.సూర్యాపేట జిల్లా ఆంధ్రా రాష్ట్రానికి ముఖ్య సరిహద్దుగా,ముఖ ద్వారంగా ఉన్నందున నిఘా కట్టుదిట్టంగా ఉండాలని,అక్రమరవాణా, అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా పని చేయాలని సూచించారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రణాళికతో ముందుకు వెళ్ళాలని,యువత డ్రగ్స్ కు అలవాటు పడకుండా ఫోకస్ పెట్టాలని,గంజాయి వినియోగం,సరఫరా లేకుండా క్షేత్ర స్థాయిలో నిర్మూలించాలని సూచించారు.రాత్రి వేళ రోడ్లపై ఆకతాయిలను,అనవసరంగా తిరిగే వారిని అదుపు చేయాలని,రాత్రి సమయంలో షాప్స్,వ్యాపారాల నిర్వహణకు సమయపాలన పాటించేలా ప్రణాళిక అమలు చేయాలని అన్నారు.
అనంతరం అదనపు ఎస్పి నాగేశ్వరరావుతో కలిసి జిల్లాలో ఉన్న డిఎస్పీలు, సీఐలు,ఎస్ఐలతో సమావేశం నిర్వహించారు.