సూర్యాపేట జిల్లా:17ఎండ్లుగా కుటుంబానికి దూరమైన మతి స్థిమితం లేని వ్యక్తి రోడ్డుపై తిరుగుతుండగా అరా తీసిన ట్రాఫిక్ కానిస్టేబుల్ స్నేహితుడి ద్వారా కుటుంబ సభ్యులకు సమాచారం అందించిన ఔదార్యం చాటుకున్నారు.17ఎండ్లుగా మతి స్తిమితం కోల్పోయి కుటుంబానికి దూరమై రోడ్డుపై పిచ్చోడిలా తిరుగుతున్న వ్యక్తిని గమనించిన ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ అతనికి చేరదీసి,భోజనం పెట్టించి వివరాలు కనుక్కునే ప్రయత్నం చేశాడు.ఈ క్రమంలో ఆ వ్యక్తి తనకు జ్ఞాపకమున్న వివరాలను కానిస్టేబుల్ కు తెలియజేశాడు.ఆ తరువాత ఆ కానిస్టేబుల్ తన మిత్రుల సహాయంతో అతడు చెప్పిన వివరాల ప్రకారం విచారణ చేయడంతో అతని ఆచూకీ,అతని సొంత వాళ్ళ వివరాలు తెలిశాయి.
స్నేహితుడి ద్వారా ట్రాఫిక్ కానిస్టేబుల్ సమాచారం అందించడంతో ఇన్ని రోజులు చనిపోయడనుకున్న వ్యక్తి బ్రతికి ఉన్నాడన్న సమాచారంతో త్వరలో ఆ వ్యక్తిని కలుసుకోబోతున్న కుటుంబ సభ్యులు ఆనందానికి అవదులు లేకుండా పోయాయి.ఇన్నాళ్ళకు ఆయన దొరకడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
మరో రెండు రోజుల్లో వచ్చి ఆ వ్యక్తిని తీసుకువెళతామని చెప్పడంతో సదరు వ్యక్తి కూడా తన వాళ్ళ దగ్గరకు వెళుతున్నందుకు ఆనందం వ్యక్తం చేస్తున్నాడు.సూర్యాపేట జిల్లా కోదాడ రూరల్ మండలంలో చోటు చేసుకున్న ఈ సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
కోదాడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహించే పాలవెల్లి రమేష్,ఇటీవల బోర్డర్ చెక్ పోస్ట్ లో డ్యూటీ పడడంతో అక్కడకు వెళ్ళాడు.అక్కడ విధులు నిర్వహిస్తున్న క్రమంలో అక్కడే యాచిస్తూ తిరుగుతున్న ఓ వ్యక్తిని గమనించాడు.
అతడు కొంత మనస్థిమితం లేని వ్యక్తిగా గుర్తించాడు.మూడురోజుల క్రితం తాను భోజనానికి వెళ్ళిన సమయంలో అతడిని గమనించి అతడికి కూడా భోజనం పెట్టించాడు.
అనంతరం అతడితో మాట్లాడుతూ అతని వివరాలు సేకరించే ప్రయత్నం చేశాడు.తన పేరు మెట్టు చంద్రయ్య అలియాస్ శ్రీను అని,తండ్రి పేరు విఠల్ అని తెలిపాడు.
మెదక్ జిల్లా రేగోడ్ మండలం మారపల్లి గ్రామం తన స్వగ్రామం అంటూ వివరాలు తెలిపాడు.దీనితో రమేష్ మెదక్ లో విధులు నిర్వహించే తన మిత్రుడు ఉపేందర్ రెడ్డి సహకారంతో అతడి వివరాలను కుటుంబ సభ్యులకు తెలిపాడు.
దీనితో అతడి కుటుంబ సభ్యులు కూడా సదరు వ్యక్తిని గుర్తించారు.మతిస్థిమితం లేని కారణంగా 17ఏళ్ళ క్రితం చికిత్స కోసం హైదరాబాద్ లోని ఎర్రగడ్డ హాస్పిటల్ కు తీసుకువెళ్ళిన సమయంలో తప్పిపోయాడని,అతడు మరణించి ఉంటాడని కుటుంబ సభ్యులు ఇన్ని రోజులుగా భావిస్తున్నారు.
తమ వ్యక్తి ఆచూకీ దొరకడంతో ఫోన్ లో మాట్లాడి,తాము వచ్చి అతడిని తీసుకువెళతామని చెప్పారు.దీనితో బుధవారం రమేష్ అతడికి కావాల్సిన వస్తువులు అందించి,కుటుంబ సభ్యులు గుర్తు పట్టేలా చేశాడు.
ఈ సందర్భంగా చంద్రయ్య మాట్లాడుతూ తనను తన వారి దగ్గరకు చేర్చేందుకు కానిస్టేబుల్ రమేష్ కృషి చేశాడని, అందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపాడు.