హోలీ పండుగ సందడిలో రైళ్లలో టికెట్ల కోసం జనం క్యూ కడుతుంటే, కొందరు మాత్రం తమ పలుకుబడిని వాడుకుని హల్చల్ చేస్తున్నారు.ఢిల్లీ-సోగారియా ఎక్స్‌ప్రెస్‌లో (Delhi-Sogaria Express)జరిగిన ఓ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మార్చి 10న ఎంకే మీనా అనే గవర్నమెంట్ రైల్వే పోలీస్ (GRP) కానిస్టేబుల్, టికెట్ చెకింగ్ చేస్తున్న TTEతో వాగ్వాదానికి దిగాడు.కారణం ఏంటంటే, మీనా భార్య ఏసీ బోగీలో స్లీపర్ క్లాస్ టికెట్‌తో ప్రయాణిస్తూ దొరికిపోయింది.
ఏసీ బోగీలో ఉండటానికి వీల్లేదని TTE చెప్పడంతో కానిస్టేబుల్‌కి కోపం నషాళానికి అంటింది.
ఇంతలో అక్కడున్న వాళ్లెవరో ఈ తతంగాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అది కాస్తా వైరల్ అయిపోయింది.వీడియోలో మీనా “వీడియో తీస్తావా.?” అంటూ TTEని బెదిరిస్తూ కనిపించాడు.అంతేకాదు ఫోన్ లాక్కుంటానని కూడా వార్నింగ్ ఇచ్చాడు.TTE కూడా ఏమీ తగ్గకుండా తన ఫ్యామిలీలో IPS ఆఫీసర్లు ఉన్నారని గట్టిగానే సమాధానం ఇచ్చాడు.ఇక మీనా అయితే ఏకంగా “నేనే ఈ ట్రైన్‌కి ఓనర్‌ని” అంటూ బిల్డప్ ఇచ్చాడు.
ఈ గొడవ పెద్దది కావడంతో చీఫ్ టికెట్ ఎగ్జామినర్ రాకేష్ కుమార్ పిప్పల్ సీరియస్ అయ్యారు.వెంటనే సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ (DCM)కి కంప్లైంట్ చేశారు.మీనా తన భార్యను బలవంతంగా ఏసీ బోగీలో కూర్చోబెట్టాడని, ఆమెకు స్లీపర్ క్లాస్ టికెట్ మాత్రమే ఉందని కంప్లైంట్‌లో రాసుకొచ్చారు పిప్పల్.
చివరికి ఆ మహిళను స్లీపర్ కోచ్‌కి షిఫ్ట్ చేశారు.అంతేకాదు టికెట్ లేకుండా ఏసీ బోగీలో ప్రయాణం చేసినందుకు గానూ రూ.530 ఫైన్ కూడా వేశారు.కోటా రైల్వే డివిజన్ సీనియర్ DCM సౌరభ్ జైన్ ఈ ఘటనపై స్పందించారు.
ఢిల్లీ-సోగారియా ఎక్స్‌ప్రెస్ సిబ్బంది రిపోర్ట్ చేశారని, విచారణ జరుగుతోందని, తగిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.