నల్లగొండ జిల్లా:కాంగ్రెస్ సర్కార్ ఉదాసీనత వైఖరి వల్ల వేలాది ఎకరాల్లో పంట ఎండిపోయి అన్నదాతలు ఆర్థికంగా నష్టపోతున్నారని బీజేపీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి అన్నారు.బుధవారం నల్గొండ రూరల్ మండలం పరిధిలోని రాములబండ,రంగారెడ్డి నగర్ గ్రామాల్లో ఎండిపోయిన పంట పొలాలను బీజేపీ నేతలతో కలిసి పరిశీలించి,రైతు కుటుంబాలను పరామర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీటి లేమితో పంటలు ఎండిపోతున్నా రైతుల బాధను ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో వేలాది ఎకరాల్లో పంట నాశనమైందని ఆవేదన వ్యక్తం చేశారు.సాగునీటి సరఫరా నిలిచిపోయి కాలువల్లో నీరు లేకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని,మౌలిక సదుపాయాల లోపం చెరువులు, రిజర్వాయర్లు పూర్తిగా దెబ్బతిన్నా ప్రభుత్వం పట్టించుకోలేదని,గ్రీన్ సిగ్నల్ లేని మోటార్లతో రైతులు నీటి కోసం బోర్లు వేయించినా,
కరెంట్ సరఫరా సరిగ్గా లేకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు.
ప్రభుత్వ పథకాలు ఆచరణలో ఫెయిల్ అయ్యాయని,రైతుల సంక్షేమం కోసం ప్రకటించిన పథకాలు చేతులు కాల్చేలా మారాయని,పరిహారం లేకపోవడంతో నష్టపోయిన రైతులకు ఎలాంటి భరోసా ఇవ్వకుండా ప్రభుత్వం మౌనం వహిస్తోందన్నారు.ఇప్పటికైనా కాలువల ద్వారా నీటి విడుదల వెంటనే చేపట్టాలని, ఎండిపోయిన పంటలను తక్షణమే సర్వే చేసి,ప్రభుత్వ సహాయం అందించాలని, చెరువుల పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని,కష్టాల్లో ఉన్న రైతులకు రుణమాఫీ ప్రకటించాలని,నష్టపోయిన రైతులకు తక్షణం నష్టపరిహారం ప్రకటించాలని డిమాండ్ చేశారు.
లేని యెడల భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఈ విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి కట్టుబడి ఉందని,రైతుల హక్కుల కోసం పోరాడుతూ,వారి సమస్యలను అధికారులకు,ప్రజలకు తెలియజేయడమే లక్ష్యంగా బీజేపీ ముందుకు సాగుతోందన్నారు.ఈ కార్యక్రమంలో జాతీయ కిసాన్ మోర్చ కార్యవర్గ సభ్యులు గోలి మధుసూదన్ రెడ్డి,బీజేపీ రాష్ట్ర నాయకులు వీరెల్లి చంద్రశేఖర్, జిల్లా జనరల్ సెక్రెటరీ పొత్తపాక లింగస్వామి,మండల అధ్యక్షుడు అనిల్,జిల్లా కోశాధికారి పకీరు మోహన్ రెడ్డి,యువ మోర్చ నాయకులు పెన్నింటి నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.







