సూర్యాపేట జిల్లా:మోతె మండలం సిరికొండ గ్రామంలోని చెరువు 10,20 ఏళ్లకు ఒకసారి కానీ నిండేది కాదు.అలాంటి గ్రామ చెరువు ఈ ఏడాది పూర్తిస్థాయిలో నిండి చాలా కాలం తర్వాత గ్రామానికి భూగర్భ జలాలను అందిస్తూ గ్రామంలోని పశుపక్ష్యాదులకు జీవనాధారంగా మారింది.
చెరువులో పూర్తిస్థాయిలో నీరు ఉండడంతో అందులో మత్స్యకారులు సొసైటీ ఆధ్వర్యంలో చేపలు పోశారు.ప్రస్తుతం చెరువు నిండుకుండలా వుండటంతో రేపు మృగశిర కార్తె సందర్భంగా చేపలు పట్టడం కోసం అనువుగా లేకపోవడంతో ఎలాంటి అనుమతులు లేకుండా మత్స్య సొసైటీ సభ్యులు చెరువు తూమును పగులకొట్టి నీటిని బయటికి తరలిస్తున్నారు.
పంట పొలాలకు ఉపయోగపడాల్సిన చెరువు నీరు వృథాగా పోతుండటంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.చెరువులో నీరు మొత్తం ఖాళీ అవుతూ పక్కనే ఉన్న ఖాళీ భూముల్లోకి చేరి పొలాలు చెరువును తలపిస్తున్నాయి.
ఈ చెరువు కింద ఎస్సీల చెందిన భూములు ఉండటంతో చెరువులో నీరు ఖాళీ అయితే వారి పొలాలకు నీటి ఎద్దడి ఏర్పడే అవకాశం ఉంటుంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.కేవలం కొంతమంది స్వార్థ ప్రయోజనాల కోసమే నీటిని వృథా చేస్తున్నారని,ఈ విషయంపై స్థానిక తహశీల్దార్ కి ఫిర్యాదు చేస్తే అది తమ పరిధిలోకి రాదని,అయినా వీఆర్వోకు తూము మూయించిమని చెప్పారని,కానీ,గ్రామంలోని రాజకీయ నాయకులు అండదండలతో చెరువు నీటిని వృథా చేస్తున్నారని గ్రామస్తులు వాపోతున్నారు.
చేపలు పట్టడం కోసం గ్రామ చెరువును ఖాళీ చేయడం ఏమిటని,ఇప్పటికైనా ఐబి అధికారులు స్పందించి చెరువు నీటిని అక్రమంగా వృథా చేస్తున్న వారిపై చర్యలు తీసుకొని,నీటి వృథాను అరికట్టాలని కోరుతున్నారు.