సూర్యాపేట జిల్లా:జిల్లాలో గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తుంగతుర్తి మండలం సంగెం గ్రామం నుండి సూర్యాపేటకు వెళ్లే రోడ్డుపై వరద ఉదృతి అధికం కావడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.దీనితో కాంగ్రెస్ పార్టీ( Congress party ) రాష్ట్ర అధికార ప్రతినిధి అన్నేపర్తి జ్ఞానసుందర్ ఆ ప్రాంతానికి వెళ్లి పరిస్థితిని పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో వరద నీటిని దాటే ప్రయత్నంలో మనుషులతో పాటు,టూవీలర్స్,కారు, ట్రాక్టర్,బర్లు,గోర్లు,మేకలు కూడా కొట్టుకపోవడం జరిగిందని,గత ఏడాది అన్నారం గ్రామానికి చెందిన సత్య యాదవ్ మృత్యువాత పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ వాగు ప్రవహించే ప్రాంతంలో చిన్న బుర్రలు వేసి రోడ్డు నిర్మాణం చేశారని,కానీ,అక్కడ వంతెన నిర్మాణం చేయాల్సిన అవసరం ఉందన్నారు.
ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ వాగుపై వంతెన నిర్మాణ కోసం ఉత్తర్వులు జారీ చేయాలని డిమాండ్ చేశారు.లేనియెడల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పకుండా సంగెం మరియు కోడూరు గ్రామంలోని నేటిపురం దగ్గర తప్పకుండా వంతెన నిర్మాణాలు చేయిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో నిమ్మన కోటి,సురేష్,యువజన కాంగ్రెస్ నాయకుడు సిద్దిరామ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.