సూర్యాపేట జిల్లా: మణప్పురం గోల్డ్ లోన్ సంస్థలో కుదువ పెట్టిన బంగారాన్ని 40 రోజుల్లో 8సార్లు రుద్ది రుద్ది అరగదీయడంతో పాటు నగను చెడగొట్టారని బాధితులు శనివారం మణప్పురం గోల్డ్ లోన్ సంస్థ ముందు ఆందోళనకు దిగిన సంఘటన సూర్యాపేట జిల్లా కేంద్రంలో వెలుగులోకి వచ్చింది.ఈ సందర్భంగా బాధితుడు ఎర్రంశెట్టిగూడెం గ్రామానికి చెందిన నాగబ్రహ్మచారి మాట్లాడుతూ తాను తయారు చేసిన మంగళసూత్రం తాడు సుమారు మూడున్నర తులాలును మణప్పురం గోల్డ్ లోన్ సంస్థలో పెట్టి రూ.1,70,000 రుణంగా తీసుకున్నట్లు తెలిపారు.40 రోజుల తర్వాత వినియోగదారుడికి బంగారు నగను ఇద్దామని గోల్డ్ లోన్ సంస్థకు విడిపించేందుకు వెళ్లానని, సంస్థ రుణం మొత్తం కట్టి నగను విడిపించుకుని వెళ్లి చూస్తే మొత్తం ఎనిమిది చోట్ల రుద్దినట్టు కనిపించిందని తెలిపారు.
తాము రుణం తీసుకునేటప్పుడు ఒకసారి మాత్రమే రుద్దారని తర్వాత ఎనిమిదిసార్లు రుద్దడంతో అవాక్కై సంస్థ వద్దకు వెళ్లి అడిగితే నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని ఆరోపించారు.మాకు వారానికి ఒకసారి ఆడిట్ ఉంటుందని, మేము అలాగే రుద్ది చెక్ చేస్తామని నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
వారు ఇలా రుద్దడంతో బంగారు నగ పూర్తిగా చెడిపోయిందని,దీంతో తాను ఇవ్వాల్సిన వినియోగదారుడు కొత్త నగను చేసి ఇవ్వమని అంటున్నట్లు తెలిపారు.కొత్త నగను చేసేందుకు ప్రస్తుతం మూడు గ్రాముల బంగారం అధికంగా అవసరం పడుతుందన్నారు.
ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశానని తనకు తగిన న్యాయం చేయాలని కోరారు.