విమానయాన( flight) రంగం అత్యాధునిక సాంకేతికతతో అభివృద్ధి చెందినప్పటికీ, కొన్ని సందర్భాల్లో చిన్న తప్పిదాలే పెద్ద ప్రమాదాలకు దారితీయవచ్చు.ప్రపంచవ్యాప్తంగా కొన్ని విమాన ప్రమాదాలు అనేక ప్రాణనష్టాలకు కారణమయ్యాయి.
అయితే సమయానికి స్పందించిన విమాన సిబ్బంది, భద్రతా బృందాలు(Flight crews and security teams) అపాయం నుంచి ప్రయాణికులను రక్షించిన ఘటనలు కూడా ఉన్నాయి.అలాంటి ఘటనే అమెరికాలోని ఓర్లాండో అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటుచేసుకుంది.
ఫ్లోరిడాలోని ఓర్లాండో (Orlando, Florida)అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం తెల్లవారుజామున ఈ దుర్ఘటన తప్పింది. డెల్టా ఎయిర్‌లైన్స్(Delta Airlines)కు చెందిన A330 విమానం అట్లాంటా నగరానికి బయలుదేరేందుకు సిద్ధంగా ఉండగా అకస్మాత్తుగా ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి.
ఈ విమానంలో అప్పటికే 282 మంది ప్రయాణికులు, 10 మంది సిబ్బంది, 2 పైలట్లు ఉన్నారు.ఈ ఘటనతో విమానాశ్రయంలో హడావుడి వాతావరణం నెలకొంది.వెంటనే ఎయిర్‌క్రాఫ్ట్ రెస్క్యూ అండ్ ఫైర్ ఫైటింగ్ బృందం రంగంలోకి దిగి, అత్యవసర స్లయిడ్‌ల ద్వారా ప్రయాణికులు మరియు సిబ్బందిని బయటకు తీసుకువచ్చారు.అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు.
ఓర్లాండో అంతర్జాతీయ విమానాశ్రయం తన సోషల్ మీడియా వేదికగా ఈ ఘటనపై స్పందించింది.“ఈరోజు ఉదయం 11:06 గంటలకు డెల్టా ఎయిర్ లైన్స్ విమానం 1213 (Delta Air Lines Flight 1213)బయలుదేరే ముందు ర్యాంప్ ప్రాంతంలో ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి.ఎయిర్‌క్రాఫ్ట్ రెస్క్యూ బృందం వెంటనే స్పందించి ప్రయాణికులను ఖాళీ చేయించింది.పూర్తి వివరాల కోసం డెల్టా ఎయిర్‌లైన్స్‌ను సంప్రదించండి” అని పేర్కొన్నారు.అలాగే డెల్టా ఎయిర్‌లైన్స్ తమ ప్రకటనలో, ఈ ఘటన కారణంగా కస్టమర్లకు కలిగిన అసౌకర్యానికి విచారం వ్యక్తం చేస్తూ, వీలైనంత త్వరగా వారి గమ్యస్థానాలకు చేర్చే ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపింది.
ఈ ఘటనలో మంటలు గాల్లోకి లేచే ముందు చెలరేగడం వల్ల పెద్ద ప్రమాదం తప్పినట్లు అధికారులు పేర్కొన్నారు.ఇటువంటి ఘటనలు విమాన ప్రయాణ భద్రత పట్ల మరింత అవగాహన పెంచుతాయి.అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలో కూడా సిబ్బంది శిక్షణ, సమయోచిత చర్యల ప్రాముఖ్యతను ఈ సంఘటన మరోసారి రుజువు చేసింది.