పేదల భూములను లాక్కుంటున్న ప్రభుత్వం

సూర్యాపేట జిల్లా:గత 70 సంవత్సరాలుగా పేదలు, వ్యవసాయ కార్మికులు,దళితులు అనుభవిస్తున్న ఇనాం భూములను,గత ప్రభుత్వాలు పేదల ఇంటి నిర్మాణం కోసం ఇచ్చిన ఇండ్ల స్థలాలను ప్రభుత్వం అభివృద్ధి పేరుతో బలవంతంగా లాక్కుంటున్న పరిస్థితి రాష్ట్రవ్యాప్తంగా ఉంది.ప్రధానంగా ఉమ్మడి నల్గొండ, రంగారెడ్డి,మహబూబ్ నగర్,మెదక్,వరంగల్, నిజామాబాద్ జిల్లాలో ప్రభుత్వ అధికారులు అతి ఉత్సాహంతో పనిచేస్తూ పేదల ఆధీనంలో ఉన్న భూములను బలవంతంగా లాక్కుంటూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు.

 The Government Is Grabbing The Lands Of The Poor-TeluguStop.com

ఇదేమిటని ప్రశ్నించిన పేదలపై కేసులు పెడుతున్నారు.తాతలు, ముత్తాతలు,తండ్రుల నుండి వారసత్వంగా వస్తున్న ఇనాం భూములపై రాష్ట్ర ప్రభుత్వం కన్ను పడింది.దీంతో ప్రభుత్వ అవసరాల పేరుతో పేదల భూములను బలవంతంగా తీసుకుంటుంది.70 సంవత్సరాలుగా పేదలు,వ్యవసాయ కార్మికులు, దళితులు,బలహీన వర్గాలకు,సేవ కులాలకు గతంలో పాలకులు ఇచ్చిన కొద్దిపాటి భూమిలో వ్యవసాయం చేసుకొని జీవిస్తున్న వారి నోటికాడి బువ్వను లాక్కుంటుంది.మాకున్న కొద్దిపాటి భూమిని ప్రభుత్వం తీసుకుంటే మేము ఎలా బ్రతకాలని నెత్తినోరు కొట్టుకుంటున్నా ఎలాంటి కనికరం లేకుండా పేదల భూములను తీసుకుంటున్నారు.ప్రజలు వ్యతిరేకిస్తే అరెస్టులు చేయడం,కేసులు పెట్టడం,బెదిరింపులకు పాల్పడడం చేస్తున్నారు.

దీనికి గ్రామాల్లో ఉన్న అధికార పార్టీ నాయకులు గుడ్డిగా మద్దతు ఇవ్వడంతో పేదలు ఇన్ని సంవత్సరాలు అనుభవిస్తున్న భూమిని కోల్పోతున్నారు.మరోపక్క గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో 1992 నుండి 2000 సంవత్సరం వరకు ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా పేదల ఇండ్ల నిర్మాణానికి(బలహీన వర్గాలకాలనీ ఏర్పాటుకై) రైతుల నుండి ప్రభుత్వమే నేరుగా భూమిని కొనుగోలు చేసి పేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేసింది.

అయితే రాష్ట్ర వ్యాప్తంగా వివిధ గ్రామాలలో ఇండ్ల స్థలాలు మంజూరు విషయంలో అనేక లోపాలు జరిగాయి.కొన్ని గ్రామాలలో పేదల ఇండ్ల నిర్మాణం కోసం భూములను కొనుగోలు చేశారు.

తప్ప లబ్ధిదారులను గుర్తించి పట్టాలు ఇవ్వలేదు.పట్టాలు ఇచ్చిన దగ్గర లేఅవుట్ చేయలేదు.

పట్టాలు ఇచ్చి లేఅవుట్ చేసిన దగ్గర లబ్ధిదారులకు కేటాయించిన స్థలాన్ని చూపించలేదు.లబ్ధిదారులను గుర్తించి పట్టాలు ఇచ్చి స్థలం చూపించిన దగ్గర ఇల్లు మంజూరు చెయ్యకపోవడం.

అలాగే మౌలిక సమస్యలైన త్రాగునీరు,సీసీ రోడ్లు,కరెంటు వంటి వసతులు కల్పించకపోవడంతో లబ్ధిదారులు ఇంటిని నిర్మించుకోలేకపోయారు.దీంతో ఆ స్థలం సుమారు 30 సంవత్సరాలుగా ఖాళీగా ఉంటుంది.

ఇదే అదునుగా భావించిన ప్రభుత్వం,అధికారులు,అధికార పార్టీ నాయకులు ఆ భూములను బలవంతంగా స్వాధీనం చేసుకోవడం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న తంతు.రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వం పేదలకు కేటాయించిన ఇండ్ల స్థలాలలో ఇండ్లు మంజూరు చేయకపోగా అందులో పల్లె ప్రకృతి వనం,రైతు వేదికలు,వైకుంఠ దామాలు, క్రీడా మైదానం,గ్రామ పంచాయతీ కార్యాలయాలు, కమ్యూనిటీ హాల్ నిర్మాణాలు,అంగన్వాడి బిల్డింగులు, గురుకుల పాఠశాలలు,పశు వైద్యశాలలు,హెల్త్ సబ్ సెంటర్ల నిర్మాణం,మొక్కల పెంపకం,ఐకెపి కేంద్రాల నిర్వహణ కోసం ఉపయోగించుకుంటున్నారు.

దీంతో పేదలు తెలంగాణ ప్రభుత్వం లోనైనా తమకు ఇల్లు వస్తుందని ఆశపడిన పేదలకు నిరాశ మిగిలింది.గత ప్రభుత్వాలు చేసిన నిర్లక్ష్యం వల్ల గూడు లేక తెలంగాణ రాష్ట్రంలో 22 లక్షల మంది పేదలు ఇబ్బందులు పడుతుంటే ఆ ఇబ్బందిని పరిష్కరించాల్సిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 8 సంవత్సరాల కాలంలో పేదలకు ఇల్లు నిర్మించిన పాపాన పోలేదు.

మరోపక్క పేదల ఇంటి నిర్మాణానికి కేటాయించిన స్థలాలను అభివృద్ధి పేరుతో బలవంతంగా లాక్కోవడం దుర్మార్గమైన చర్య.పేదలకు కేటాయించిన ఇండ్ల స్థలాల్లోనైనా డబల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మిస్తారేమో అనుకున్న పేదలకు సొంత ఇంటి నిర్మాణం కలగానే మిగిలింది.

రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని గ్రామాలలో పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలలో డబల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి 8 సంవత్సరాలు అవుతున్న నేటికీ వివిధ దశలలో ఉన్నాయి తప్ప పూర్తి కాని పరిస్థితి.అక్కడక్కడా అడపాదడపా నిర్మించినా,అవి పూర్తి అయినా పాలకుల నిర్లక్ష్యం మూలంగా నేటికీ లబ్ధిదారులను గుర్తించి పంపిణీ చేయకపోవడంతో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు అనేక జిల్లాలో శిథిలావస్థలోకి చేరాయి.

కోట్లాది రూపాయలు ప్రజాధనం వెచ్చించి నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఎప్పటికీ పూర్తి అవుతాయో తెలియని పరిస్థితి.దీన్ని బట్టి చూస్తే పేదల,వ్యవసాయ కార్మికుల,దళితుల, బలహీన వర్గాల పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏమిటో అర్థం అవుతుంది.

రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా పేదలు,వ్యవసాయకార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం చొరవ చూపాలని ఆశిద్దాం.రచయిత:మట్టిపెళ్లి సైదులు,తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు సెల్:8106778287.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube