సూర్యాపేట జిల్లా: గరిడేపల్లి మండలం కాపుర్య తండాలో నెలకొన్న మంచి నీటి కష్టాలపై శనివారం గిరిజన మహిళలు రోడ్డెక్కారు.ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేస్తూ ధర్నా నిర్వహించారు.
వారికి బహుజన సమాజ్ పార్టీ నాయకులు సంఘీభావం తెలిపారు.ఈసందర్భంగా గిరిజన మహిళలు మాట్లడుతూ రెండు బిందెల మంచి నీళ్ల కోసం అన్ని పనులు మానుకుని వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని,గత నెల రోజుల నుండి కనీసం మంచినీరు దొరకక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
చివరికి దిక్కుతోచని పరిస్థితిలో స్థానిక సర్పంచ్,కార్యదర్శి కి మొరపెట్టుకున్నా పట్టించుకొనే నాథుడే కరువయ్యాడని వాపోయారు.
ప్రతి వేసవిలో తమకు నీటి కష్టాలు తప్పడం లేదని,మురికి నీళ్లు తాగి రోగాల బారిన పడుతున్నామని, బోర్లు పనిచేయకపోవడం, బావులు పాడుబడడంతో ఎవరికి చెప్పినా ఫలితం లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తమ గోడును ఎవరూ పట్టించుకోకపోవడంతో గరిడేపల్లి మెయిన్ రోడ్ మీద ధర్నాకు దిగాల్సి వచ్చిందన్నారు.అనంతరం బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా ఇంచార్జి రాపోలు నవీన్ కుమార్ మాట్లాడుతూ గిరిజనుల నీటి కష్టాలను గుర్తించి ప్రభుత్వం అధికారులు వెంటనే తాగునీటి సమస్యలు లేకుండా చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఉపాధ్యక్షలు జీలకర్ర రామస్వామి, స్థానిక ప్రజలు,గిరిజన మహిళలు తదితరులు పాల్గొన్నారు.