సూర్యాపేట జిల్లా:రైతులు పండించిన ధాన్యం కొనుగోలు మరియు మద్దతు ధర ఇవ్వాల్సిన బాధ్యత కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలదేనని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు.మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని నూతన వ్యవసాయ మార్కెట్ ను సందర్శించి,ధాన్యం కొనుగోలును పరిశిలించి,రైతులతో మాట్లాడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులు పండించిన పంటల కొనుగోలు విషయంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు నాటకాలాడుతూ,ధర్నాలు చేస్తూ,రైతులను దగా చేస్తున్నాయని విమర్శించారు.వ్యవసాయ మార్కెట్లో ఒక్కోక్క రైతు క్వింటాలుకు రూ.500 నుంచి రూ.300 వరకు నష్టపోతున్నారని,ఇలాంటి పరిస్థితే కొనసాగితే రైతుల ఆత్మహత్యలు కొనసాగుతాయని ఆవేదన వ్యక్తం చేశారు.కేంద్రమేమో పచ్చి బియ్యం పెడితేనే తీసుకుంటామని,రాష్ట్రమేమో పచ్చి బియ్యానికి ధర పెట్టలేమని చెప్పడం రైతులను మోసం చేయడమేనని దుయ్యబట్టారు.ధాన్యం సేకరించడం,నిలువ చేయడం కేంద్రానిదే బాధ్యతని, రైతులు నష్టపోయే ప్రతి క్వింటాలుకు కేంద్రం 60 శాతం చొప్పున,రాష్ట్రం 40 శాతం చొప్పున భరించి ధాన్యం కొనుగోలు చేయాలని అందుకనుగుంగా ఐకెపి కేంద్రాల ద్వారా,పీఏసీఎస్ కేంద్రాల ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
రైతులకు జరుగుతున్న నష్టాన్ని భరిస్తామని కేంద్రం ప్రకటించాలని,రైతుల జీవితాలతో ఆటలాడకుండా, చోద్యం చూడకుండా ఉండి రైతుల ప్రాణాలు కాపాడాలని డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా ఒక రైతు తాను తెచ్చిన సన్న ధాన్యానికి కనీస ధర కూడా ఇవ్వడంలేదని,తనకు చావు తప్ప మరొకటి లేదని బోరున విలపించడంతో ఆయనను ఓదార్చి చావు పరిస్కారం కాదని,మద్దతు ధర ఇవ్వాలని ప్రభుత్వాలను ప్రశ్నించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి మందడి రాంరెడ్డి,కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి కోట గోపి,డివైఎఫ్ఐ జిల్లా నాయకులు జె.నర్సింహారావు మరియు రైతులు పాల్గొన్నారు.