సూర్యాపేట జిల్లా:బహుజన్ సమాజ్ పార్టీ రాజ్యాధికారం యాత్రలో భాగంగా బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్ డా.ఆర్.
ఎస్.ప్రవీణ్ కుమార్ కోదాడ నియోజకవర్గ పరిధిలోని అనంతగిరి మండలం వాయిల సింగారం గ్రామానికి చేరుకున్నారు.ఈ సందర్భంగా గ్రామంలోని ప్రజలు,మహిళలు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు.అనంతరం గ్రామస్తులనుద్దేశించి ఆయన మాట్లాడుతుండగా మహిళలు ఒక్కసారిగా తమ సమస్యలను ప్రవీణ్ కుమార్ తో ఏకరువు పెట్టారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో గ్రామానికి వచ్చిన ప్రస్తుత కోదాడ ఎమ్మెల్యే బొల్లం మలయ్య యాదవ్ ఇళ్ళు ఇస్తామని,పెన్షన్స్ఇస్తామని, మూడెకరాల భూమి ఇస్తామని అనేక రకాల మాటలు చెప్పారని,ఓట్లేసి గెలిపిస్తే ఎమ్మెల్యే అయ్యాక ఇప్పుడు తమను ఏ మాత్రం పట్టుంచుకోవడం లేదని నిప్పులు చెరిగారు.మహిళల ఆవేదన,ఆవేశం చూసిన ఆర్ఎస్పీ మాట్లాడుతూ ప్రస్తుతం దేశంలో,రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీలైనా,ప్రతిపక్షంలో ఉన్న పార్టీలైనా కేవలం వారి స్వార్థ ప్రయోజనాల కోసమే అమలుకు నోచుకోని హామీలు ఇచ్చి ఓట్లు దండుకొని గద్దెనెక్కాక హామీలను తుంగలో తొక్కి,వారు తరాలకు సరిపడా ఆస్తులు కూడబెట్టుకుంటారని,అందుకే వారి మాయమాటలు నమ్మి,వారిచ్చే ఓటుకు నోటు,బీరు బిర్యానికి ఆశపడి ఓట్లేసి మోసపోవద్దని అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం తెచ్చేందుకే తాను ఉన్నత ఉద్యోగాన్ని వదులుకొని,బీఎస్పీ నీలి జెండా పట్టుకొని మీ కోసం వచ్చానని,మీరంతా ఆలోచించి ఏనుగు గుర్తుపై ఓటేసి గెలుపిస్తే మీ బిడ్డల బ్రతుకులు మార్చి చూపిస్తానని అన్నారు.ఈ కార్యక్రమంలో బీఎస్పీ సూర్యాపేట జిల్లా ఇంచార్జీ పిల్లుట్ల శ్రీనివాస్,కోదాడ నియోజకవర్గ ఇంచార్జీ గుండెపంగు రమేష్,అనంతగిరి మండల నాయకులు,కార్యకర్తలు,మహిళలు పాల్గొన్నారు.