సూర్యాపేట జిల్లా:సంక్షేమ వసతి గృహ విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ధనియాకుల శ్రీకాంత్ వర్మ అన్నారు.శనివారం జిల్లా కేంద్రంలో సంక్షేమ వసతి గృహలలో సర్వే నిర్వహించిన అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ హాస్టళ్లకు పక్కా భవనాలు లేక అద్దె భవనాల్లో అరకొర వసతుల నడుమ విద్యార్థులు కాలం వెళ్లదీస్తున్నారన్నారు.
ప్రభుత్వం మూడేళ్లుగా అద్దె చెల్లించడం లేదని ఓనర్లు ఖాళీ చేపిస్తున్న దుస్థితి ఏర్పడిందన్నారు.వార్డెన్ల, వర్కర్ల నిర్లక్ష్యంతో ఏ ఒక్క హాస్టల్లో కూడా 2023-24 మెనూ సక్రమంగా అమలు కావడం లేదని,ముద్దలుగా ఆహారం,నీళ్ల చారు,నీళ్ల మజ్జిగతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు.
ఇంతవరకు మెస్,కాస్మోటిక్ చార్జీలు విడుదల కాలేదన్నారు.విద్యా సంవత్సరం ప్రారంభమై రెండు నెలలు అవుతున్నా హాస్టల్స్ లో ప్లేట్స్,బాక్స్,బెడ్ షీట్స్,స్టడీ చైర్లు యూనిఫాంలు ఇవ్వలేదన్నారు.
పేద,బడుగు,బలహీన వర్గాలకు చెందిన విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వాలు చెలగాటం మాడడం సరైనది కాదని, సంక్షేమ వసతి గృహ విద్యార్థుల సమస్యలను పరిష్కారం చేసి నాణ్యమైన ప్రమాణాలతో కూడిన విద్యా,పౌష్టికాహారం ప్రతి ఒక్కరికి అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.
ఈకార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బానోత్ వినోద్ కుమార్,జిల్లా ఉపాధ్యక్షుడు అక్కినపల్లి వినయ్,మధు,గణేష్,సంతోష్,సందీప్ తదితరులు పాల్గొన్నారు
.