అక్రమ కట్టడాల నెపంతో అధికారుల కూల్చివేతలు- అడ్డుకున్న బాధితులు.సర్వే నెంబర్ 1లో ఉన్నది సుమారు తొమ్మిది ఎకరాల ప్రభుత్వ భూమి.
గత కొన్నేళ్ళుగా అందులో నివాసముంటున్న నిర్వాసిత గిరిజనులు.పునరావాసం కింద కేటాయించింది 4 ఎకరాల 30 కుంటలే అంటున్న అధికారులు.
అడ్డుకున్న నిర్వాసితులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలింపు.
సూర్యాపేట జిల్లా:ఒకవైపు రాజకీయ పార్టీ నేతల కబ్జాలు,మరోవైవు అధికారుల బలవంతపు భూ ఆక్రమణలు,ఇంకోవైపు అక్రమ కట్టడాల పేరుతో కూల్చివేతలు.వరుస సంఘటనలతో సూర్యాపేట జిల్లా అట్టుడుకుతుంది.నిత్యం ఏదో ఒక చోట వెలుగుచూస్తున్న ఘటనలతో బాధితుల ఆర్తనాదాలు, ఆందోళనలు నిత్యకృత్యంగా మారాయి.ఈ నేపథ్యంలో సోమవారం మఠంపల్లి మండలం మట్టపల్లి గ్రామంలోని ఆర్ అండ్ ఆర్ పునరావాస కేంద్రం వేదికైంది.వివరాల్లోకి వెళితే మట్టపల్లి ఆర్ అండ్ ఆర్ పునరావాస కేంద్రంలో గత కొన్నేళ్లుగా నిర్వాసిత గిరిజనులు నివాసాలు ఏర్పరచుకుని జీవిస్తున్నారు.
నాటి నుండి నేటి వరకు వారి జోలికి వెళ్లిన వారు లేరు.ఇప్పుడు ఆ భూములపై ఎవరి కన్ను పడిందో ఏమో తెలియదు కానీ,అందులో మిగులు భూమి ఉన్నదని,చాలా వరకు అక్రమ కట్టడాలనే నెపంతో అధికారులు అర్ధాంతరంగా రంగప్రవేశం చేసి నివాసముంటున్న ఇండ్లును కూల్చివేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
కష్టపడి పైసా పైసా కూడబెట్టుకుని,అప్పులు చేసి నివాసాలు ఏర్పాటు చేసుకుంటే ఉన్నఫలంగా అక్రమ కట్టడాలంటూ కూల్చివేయడం ఏమిటని నిర్వాసిత గిరిజనులు అధికారులను అడ్డుకోవడంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.ఈ విషయం తెలుసుకున్న కాంగ్రేస్ పార్టీ నేతలు పునరావాస కేంద్రం వద్దకు చేరుకుని బాధితులకు అండగా నిలిచారు.
ఇలా అర్దాంతరంగా ఇళ్లను కూల్చివేయడం ఏమిటని, ప్రభుత్వ భూములు పెద్దలకే కానీ,పేదలకు హక్కు లేదా అని ప్రశ్నించారు.అధికారుల సమక్షంలో ఒక సమావేశం ఏర్పాటు చేసి గిరిజనులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
కూల్చివేతలను అడ్డుకున్న నిర్వాసితులను పోలీసులు అరెస్ట్ చేసి వివిధ పొలీస్ స్టేషన్లకు తరలించారు.